జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకు ప్రాణహాని ఉందంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. తన ఇంటి దగ్గర కొందరు రెక్కీ కూడా చేశారని పవన్ చేసిన ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని స్పందించారు.
తనకు ప్రాణహాని ఉందని పవన్ ఏనాడైనా పోలీసులకు చెప్పారా అని నాని ప్రశ్నించారు. పవన్ కు చంద్రబాబు వల్లే ప్రాణహాని ఉందని, సినిమాలలో, తన దగ్గర పనిచేసే సిబ్బందిని తప్ప బయట ఎవరిని పవన్ కొట్టలేరని ఎద్దేవా చేశారు. పవన్ ది రౌడీ మనస్తత్వమని, అందుకే గుడ్డలిప్పి తంతా అంటూ మాట్లాడుతున్నారని నాని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్ లపై గతంలో పవన్ విమర్శలు గుప్పించిన విషయాన్ని నాని గుర్తు చేశారు. చంద్రబాబుతో పొత్తు అనగానే పవన్ వెంట కాపులు తిరగడం మానేశారని, ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కలిసిపోతారని నాని జోస్యం చెప్పారు.
మరోవైపు, పవన్ కళ్యాణ్ పై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ పెద్ద రౌడీ, గూండా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ పై రౌడీ కేసులు కూడా ఉండొచ్చని, జనసేనలో అందరూ రౌడీలేనని బొత్స అన్నారు. వైసీపీ నేతలపై పవన్ ఇష్టారీతిన నోరు పారేసుకుంటున్నారని, అది సరైన పద్ధతి కాదని హితవు పలికారు.
మరోవైపు కాకినాడలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ వ్యాఖ్యలకు ద్వారంపూడి కూడా దీటుగా బదులిచ్చారు. ఈ నేపథంలో వారిద్దరి మధ్య మాటలు యుద్ధం కొనసాగుతూనే ఉంది. సినీ రంగంలో పవన్ చిట్టా తన దగ్గర ఉందని, కానీ, బాగుండదని తాను బయటికి వెల్లడించడం లేదని ద్వారంపూడి అన్నారు. సినీ ఫీల్డ్ లో తనకు చాలా మందితో పరిచయాలు ఉన్నాయని, తాను ఎగ్జిబిటర్ అని, పవన్ కు ఈ విషయం తెలియదని చెప్పారు.