కొంతకాలంగా సినిమా టికెట్ల వ్యవహారంలో జగన్ సర్కార్ కు, సినీ ప్రముఖులకు మధ్య తీవ్ర స్థాయి చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల జగన్ తో చిరంజీవితోపాటు పలువురు భేటీ అయిన తర్వాత టికెట్ రేట్ల పెంపుపై జగన్ సర్కార్ సానుకూలంగా వ్యవహరించిందని టాక్ వచ్చింది. ఫిబ్రవరి నెలాఖరు లోపు రేట్లు, అదనపు షోలపై తీపి కబురు అందుతుందని చిరు చెప్పారు. కానీ, చిరు తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన భీమ్లానాయక్ విడుదలనాటికి కొత్త రేట్లపై ఎటువంటి ప్రకటన రాలేదు.
అయితే, మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఈ వ్యవహారం కాస్త పెండింగ్ లో పడిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ, పవన్ ను టార్గెట్ చేసేందుకే టికెట్ రేట్ల పెంపు నిర్ణయం వాయిదా వేశారని విపక్ష నేతలు, జనసేన నేతలు, పవన్ అభిమానులు అంటున్నారు. జనసేన అధినేత, ఈ సినిమాపై జగన్ సర్కార్ కక్ష సాధిస్తూ టికెట్ రేట్లు తగ్గించే అమ్మాలని నిర్ణయించిందని, సరిగ్గా సినిమా విడుదలకు ముందు రోజు థియేటర్లపై దాడులు, తనిఖీలు, సోదాలు అంటూ వేధింపులకు దిగిందని పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
భీమ్లానాయక్ సినిమా బెనిఫిట్, స్పెషల్ షోలకు ఏపీలో అనుమతులివ్వని అధికారులు….థియేటర్లో అదనంగా కుర్చీలు వేసినా సీజ్ చేస్తామని హెచ్చరించడంపైనా ఫ్యాన్స్ మండిపడ్డారు. ఇవే నిబంధనలు అన్ని సినిమాలకు వర్తించలేదని,కావాలని తమ హీరోను ఇబ్బందిపెడుతున్నారని అన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంపై పవన్ కల్యాణ్ పరోక్షంగా స్పందించారు.
“ఒక మార్పు కోసం యుద్ధం చేయాల్సి వస్తే 99 సార్లు శాంతియుతంగానే ప్రయత్నిస్తాను…100వ సారే యుద్ధం చేస్తాను” అంటూ పవన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. పవన్ తోపాటు ఆ డైలాగ్ ఉన్న పెన్సిల్ ఆర్ట్ పిక్ ను పవన్ ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ ట్వీట్ తో జగన్ సర్కార్ పై పవన్ తన వైఖరిని పరోక్షంగా చెప్పారని, సైలెంట్ గా, శాంతియుతంగా ఎల్లకాలం ఉండబోనని జగన్ కు పవన్ వార్నింగ్ ఇచ్చారని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.