టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. ప్రాథమిక ఆధారాలు లేకుండానే అర్ధరాత్రి వెళ్లి చంద్రబాబును అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. విశాఖలో తనపై పోలీసులు ఏ విధంగా వ్యవహరించాలో చూశారని, ఏ తప్పు చేయని జనసేన నాయకులపై కేసులు పెట్టారని అన్నారు. అదేవిధంగా చంద్రబాబును కూడా అరెస్ట్ చేశారని విమర్శలు గుప్పించారు.
పాలనాపరంగా అనుభవజ్ఞుడైన చంద్రబాబు వంటి నేతపై ప్రభుత్వ తీరు సరికాదని హితవు పలికారు.
చిత్తూరులో ఘటన సందర్భంగా కూడా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రభుత్వమే ప్రవర్తించిందని పవన్ సంచలన ఆరోపణలు చేశారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సింది పోలీసులని, దాంతో వైసిపి నేతలకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. వైసిపి ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా తయారయ్యాయని దుయ్యబట్టారు. పార్టీ అధినేత అరెస్టును ఖండిస్తూ ఆ పార్టీకి చెందిన నేతలు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేయడం సహజమని అన్నారు. కానీ, వారిని ఇళ్ల నుంచి బయటకు రానివ్వం, రోడ్లమీద తిరగనివ్వం అంటే ఎలా అని పవన్ ప్రశ్నించారు.
వైసిపి నాయకులు అక్రమాలు, దోపిడీలు చేయవచ్చని, విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంటుందని విమర్శించారు. చంద్రబాబు అరెస్టు శాంతిభద్రతల అంశం కాకుండా రాజకీయ కక్ష సాధింపు అంశంగా కనిపిస్తుందని పవన్ అన్నారు. చంద్రబాబుకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని, ఈ వ్యవహారం నుంచి ఆయన త్వరగా బయటపడాలని కోరుకుంటున్నానని అన్నారు.