ఇటీవల గన్నవరం ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత వ్యవహారంపై ప్రభుత్వ వ్యతిరేక పోస్టుపై రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఆ పోస్టును వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వార్డ్ చేశారన్న ఆరోపణలపై సీనియర్ జర్నలిస్టు అంకబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. 73 ఏళ్ల అంకబాబుపై ఐపీసీ 153 (ఏ), 505 (2), రెడ్ విత్ 120 (బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి..ఇబ్బందిపెట్టడంపై టీడీపీ నేతలతో పాటు పలు విపక్ష పార్టీల నేతలు కూడా ఖండించారు.
ఇక, అంకబాబు అరెస్ట్ ను నిరసిస్తూ నిరసనకు దిగిన జర్నలిస్టు, మహా న్యూస్ ఎండీ వంశీ కృష్ణ, జర్నలిస్ట్ కృష్ణాంజనేయులు తదితరులను అరెస్ట్ చేయడంపై కూడా వారు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులతో జర్నలిస్టులను కట్టడి చేయలేరని మండిపడ్డారు. ఈ అరెస్టులు ప్రభుత్వ నిరంకుశ ధోరణికి నిదర్శనమని పవన్ ఫైర్ అయ్యారు.
ఆ న్యూస్ ను అంకబాబు తమ జర్నలిస్టుల వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తే తప్పేముందని పవన్ ప్రశ్నించారు. ఈ ఘటనపై ప్రభుత్వం రియాక్షన్ ను బట్టి ఇందులో ఏదో మతలబు ఉందనిపిస్తోందని పవన్ అనుమానం వ్యక్తం చేశారు. అరెస్ట్ సమయంలో సీఐడీ అధికారులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని కూడా పవన్ ఆరోపించారు. ఇదే సీఐడీ పోలీసులు…న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల పోస్ట్ లు షేర్ చేస్తున్న వైసీపీ శ్రేణులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని పవన్ ప్రశ్నించారు.
మరోవైపు, ఈ కేసులో అంకబాబుకు కోర్టు ఊరటనిచ్చింది. అంకబాబును సీఐడీ పోలీసులు గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. ఆయనను రిమాండ్ కు తరలించాలని సీఐడీ వాదనలు వినిపించింది. అయితే, సీఆర్పీపీసీ 41 నోటీసులు ఇవ్వకుండా ఎందుకు అరెస్టు చేశారని సీఐడీ పోలీసులను కోర్టు ప్రశ్నించింది. నోటీసులు ఇస్తే అంకబాబు తీసుకోలేదని వారు కోర్టుకు విన్నవించారు. తనకెలాంటి నోటీసులు ఇవ్వలేదని కోర్టుకు దృష్టికి అంకబాబు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కోర్టు సీఐడీ పోలీసుల రిమాండ్ రిపోర్టును తిరస్కరించింది. అంకబాబుకు 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి వదిలేయాలని సీఐడీ పోలీసులను కోర్టు ఆదేశించింది.