మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జరిగిన 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలతో మాట్లాడిన పవన్…ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ పథకాలకు సీఎం ఆయన కుటుంబ సభ్యుల పేర్లు పెట్టుకుంటున్నారని పవన్ విమర్శలు గుప్పించారు. వాళ్లెవరూ దేశం కోసం పనిచేయలేదని, వాళ్ల పార్టీల బాగు కోసమే పనిచేశారని పవన్ అన్నారు.
మన సంపాదన పన్నులుగా కడితే పథకాలకు వాళ్ల పేర్లు పెట్టుకుంటున్నారని, సంపాదన మనది, పేరు వారిది అని పవన్ దుయ్యబట్టారు. దేశం కోసం, రాష్ట్రం కోసం పోరాడిన మహనీయులు, స్వాతంత్ర్య సమరయోధుల పేర్లు వారికి ఎందుకు గుర్తుకు రావని పవన్ ప్రశ్నించారు. జనసేన అధికారంలోకి వస్తే అన్ని పథకాలకు జాతీయ నాయకులు, రాష్ట్రంలోని మహనీయులు, పింగళి వెంకన్న, పొట్టి శ్రీరాములు, ప్రకాశం పంతులు వంటి గొప్పవారి పేర్లను పెడతామని పవన్ అన్నారు.
ప్రస్తుత రాజకీయాలు రాచరికపు వ్యవస్థను తలపిస్తున్నాయని, కిరీటం లేని నాయకులు రాజులుగా పాలిస్తున్నారని పవన్ అన్నారు. తమ పిల్లలకు వారసత్వంగా కట్టబెట్టడమే రాజకీయం అన్న చందంగా నేటి రాజకీయాలు తయారయ్యాయని విమర్శించారు. యువతకు వారి భవిష్యత్ నిర్మించుకోగలిగే వ్యవస్థ కావాలని, రూ.5 వేల జీతానికి వలంటీర్లు గానో, సిమెంటు ఫ్యాక్టరీల్లో పనిచేసేందుకో వారి చదువులు పనికొచ్చేలా ఉండకూదని అన్నారు.
రాజకీయ నేతలు అంటే పేకాట క్లబ్బులు నడిపేవారు, సూట్ కేసు కంపెనీలతో కోట్లు దోచుకునేవారు కాదని వ్యాఖ్యానించారు. స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తితో భావితరాల కోసం పనిచేసే కొత్త తరం యువత రాజకీయాల్లోకి రావాలని పవన్ ఆకాంక్షించారు. మన దేశంలో ఏది పెట్టాలన్నా…అందరకీ లంచాలి వ్వాలని, అందుకే టాలెంట్ ఉన్న భారతీయులు విదేశాలకు వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.