ఏపీ డిప్యూటీ సీఎం కల్యాణ్ కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానుల నుంచి ఇబ్బందికర నినాదాలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కల్యాణ్ పాల్గొంటున్న పలు కార్యక్రమాల్లో జనసేన కార్యకర్తలతో పాటు పవన్ అభిమానులు కూడా భారీ సంఖ్యలో హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఓజీ..ఓజీ అంటూ పవన్ ను ఉద్దేశించి పవన్ అభిమానులు కేకలు వేస్తున్నారు.
అలా కేకలు వేయొద్దని, సమయం సందర్భంగా చూడాలని ఫ్యాన్స్ ను పవన్ పలుమార్లు సుతిమెత్తగా హెచ్చరించినా ఫలితం లేకపోయింది. అభిమానులు తనను ఓజీ..ఓజీ అంటూ బెదిరిస్తున్నారని పవన్ సెటైర్లు వేసిన వారి తీరు మారలేదు. ఈ క్రమంలోనే తాజాగా విజయవాడ బుక్ ఫెయిర్ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా కూడా పవన్ కు ఈ సమస్య ఎదురైంది. ఈ నేపథ్యంలోనే ఓజీ..ఓజీ అని అరిచే బదులు శ్రీ శ్రీ అని అరిస్తే బాగుంటుందని పవన్ అన్నారు.
అభిమానులందరికీ తాను ప్రాణం అయితే తనకు మాత్రం పుస్తకాలు అంటే ప్రాణం అని చెప్పారు. పుస్తకాలు రాయాలంటే జీవితాలు చూడాలని, అక్షర యుద్ధం ఎప్పుడు ఒకరే చెయ్యాలని అన్నారు. పుస్తక పఠనం లేకపోతే నేను ఏమైపోయేవాడినోనని అన్నారు. తొలిప్రేమ సినిమా రెమ్యున్ రేషన్ 15 లక్షల రూపాయలు పెట్టి పుస్తకాలు కొన్నానని అన్నారు. తన వదిన సురేఖ ఇచ్చే పాకెట్ మనీతో పుస్తకాలు కొన్నానని అన్నారు. తన దగ్గర ఉన్న పుస్తకాలు ఎవ్వరికైనా ఇవ్వాలంటే మనసు రాదని, డబ్బులు కావాలంటే వెంటనే సాయం చేస్తానని చెప్పారు. ఇంటర్ తో చదువు ఆపేసినా..పుస్తకాలు చదవడం మాత్రం ఆపలేదన్నారు.