రేపు పెడన నియోజకవర్గంలో వారాహి విజయ యాత్ర బహిరంగ సభ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే నేడు జరిగిన జనవాణి కార్యక్రమంలో పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపటి సభలో దాడులు చేయడానికి కొందరు వైసీపీ కిరాయి గూండాలు ప్రయత్నిస్తున్నారనే సమాచారం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. సుమారు రెండు, మూడు వేలమంది రౌడీ మూకలు వచ్చే అవకాశం ఉందని ఆరోపించారు. జనసైనికులు, టీడీపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పవన్ పిలుపు నిచ్చారు. జనసేన, టీడీపీ పొత్తు విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
పులివెందుల రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు జగన్…పెడన సభలో కత్తులు, రాళ్లతో దాడులు చేయించాలని చూస్తున్నావ్… ఏదైనా జరిగితే బాధ్యత నీదే అని పవన్ షాకింగ్ కామెంట్లు చేశారు. రాష్ట్ర డీజీపీ, జిల్లా ఎస్పీ, అధికారులకు, కలెక్టర్లకు శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత ఉందని, వారు వైసీపీ నాయకులకు వత్తాసు పలకడం సరికాదని హితవు పలికారు. రేపు పెడనలో ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. అయితే, వైసీపీ మూకలను పట్టుకొని ఎదురుదాడులు చేయొద్దని, పోలీసులకు అప్పగించాలని పవన్ పిలుపునిచ్చారు.
మరోవైపు, జనవాణి సందర్భంగా పవన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర వెన్ను నొప్పి, నడుము నొప్పి రావడంతో పవన్ అర్ధాంతరంగా జనవాణి నుంచి వెళ్లిపోయారు. దీంతో, రేపు పెడన సభకు పవన్ హాజరవుతారా లేదా అన్నది తేలాల్సి ఉంది.