వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ వ్యాఖ్యలపై వాలంటీర్లు రాష్ట్రవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తూ పలుచోట్ల ఆయన దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి వాలంటీర్లపై పవన్ షాకింగ్ కామెంట్లు చేశారు. వాలంటీర్లకు 5 వేల జీతమిచ్చి జనాల ఇళ్లలో దూరే చాన్స్ ను జగన్ కల్పించారని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల వ్యవస్థ కొత్తగా వచ్చిందని, అది లేని సమయంలో దేశం ఆగిపోయిందా? అని ప్రశ్నించారు.
ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం వాలంటీర్ల దగ్గరుందని, దానిని వారు ఎవరికి ఇస్తున్నారని ప్రశ్నించారు. మహిళల మిస్సింగ్ కేసులను పక్కదారి పట్టించేందుకే తనపై, తన భార్యపై విమర్శలు చేస్తున్నారని, వైసీపీ నేతల మాటలకు తన భార్య కూడా ఏడుస్తోందని పవన్ బాధపడ్డారు. జగన్ అంటే కోపం లేదని, ప్రభుత్వ విధానాలపైనే తన కోపమని చెప్పారు. వాలంటీర్లు సేకరించిన సున్నితమైన సమాచారం వేరే వాళ్ళ చేతులలోకి వెళ్తే ఎలా అని ప్రశ్నించారు. ప్రజలను అదుపు చేసేందుకే వాలంటీర్లని, కొన్నిచోట్ల ప్రజలను వాలంటీర్లు బెదిరిస్తున్నారని ఆరోపించారు.
తాను అందరు వాలంటీర్లను అనలేదని, 100 పండ్లలో కుళ్ళిన పండు ఒకటి ఉన్నా మిగతావి కూడా కుళ్ళిపోతాయని చెప్పారు. 5 వేలిచ్చి వాలంటీర్లతో ఊడిగం చేయిస్తున్నారని, వాలంటీర్లతో వెట్టిచాకిరి చేయిస్తున్న జగన్.. క్లాస్ వార్ అంటూ కామెంట్స్ చేయడం హాస్యాస్పదమని చెప్పారు. ప్రతి పార్టీ వారు వాలంటీర్ వ్యవస్థపై కన్నేసి ఉంచాలని చెప్పారు. వైసీపీకి మాత్రమే పనిచేస్తామని వాలంటీర్లు అంటే ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. మహిళల మిస్సింగ్ పై కేంద్ర సంస్థలు అధ్యయనం చేస్తున్నాయని అన్నారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
మరోవైపు, పవన్ వ్యాఖ్యలపై టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పరోక్షంగా స్పందించారు. వాలంటీర్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని, మంచి పనులు చేసేవారిపై బురదజల్లడం సహజమని అన్నారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి వాలంటీర్లు సేవలదించారని కొనియాడారు. ఇటీవల సీఎం జగన్ తో భేటీ అయిన రాయుడు…త్వరలోనే వైసీపీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.