జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ తడబడ్డారు. తనకు అధికారంపై వ్యామోహం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు విన్న పార్టీ నాయకులు.. పార్టీ అభిమానులు. ముఖ్యంగా పవన్ను సీఎంగా చూడాలని తపిస్తున్న ఆయన వర్గం కూడా తీవ్ర ఆలోచనలో మునిగిపోయింది. “మా నాయకుడు ఇలా మాట్లాడడం ఏంటి. ఇలా మాట్లాడి ఎలాంటి సంకేతాలు పంపిస్తున్నారు? “ అంటూ.. నాయకుల మధ్య గుస గుస ప్రారంభమైంది.
వాస్తవానికి కొన్ని నెలలుగా.. పవన్ తనకు అధికారం కావాలని చెబుతూ వచ్చారు. గత నెలలో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో మంగళగిరిలో మాట్టాడుతూ.. వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తుందని.. చెప్పారు. అంతేకాదు.. వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా.. చూస్తానని.. అన్ని పార్టీలను కలుపుతానని.. అధికారంలోకి వస్తామని.. అధికారమే ధ్యేయంగా.. జనసైనికులు అడుగులు వేయాలని ఆయన సూచించారు. ఇది బాగానే వర్కవుట్ అయింది.
అయితే.. ఇంతలోనే తాజాగా ఆయన మంగళగిరిలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మనకు అధికారమే పరమావధి కాదు.. వైసీపీ ఓటు బ్యాంకును చీలిపోకుండా.. ఆ పార్టీ అధికారంలోకి రాకుండా.. చూడడమే ముఖ్యమని ఆయన ఉద్భోదించారు. దీంతో ఇప్పటి వరకు పవన్ సీఎం అవుతారని అంటూ వచ్చిన నాయకులకు మైండ్ బ్లాంక్ అయింది. దీనిని బట్టి.. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే.. సీఎం సీటు విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని ముందుగా నే ఆయన గుర్తించారని కొందరు అంటున్నారు.
ఈ క్రమంలో కొన్నాళ్లు గా జరుగుతున్న సీఎం సీటు రగడకు పవన్ ఫుల్ స్టాప్ పెట్టారని ఒక వర్గం చెబుతోంది. అయితే.. జనసేననే నమ్ముకుని 8 సంవత్సరాలుగా పార్టీతో నడుస్తున్న వారికి .. పదవులపై వ్యామోహం ఉంటుంది కదా! మరి వీరు ఎన్నాళ్లు ఎదురు చూడాలి.. ? అనేది మౌలిక ప్రశ్న. దీనికి పవన్ ఎలా సమాధానం చెబుతారో.. పదవులు ఆశిస్తున్న జనసైనికులను ఏం చెబుతారు.? అనేది ఆసక్తిగా మారింది. ఏదేమైనా.. పవన్ తాజా ప్రకటనపై సొంత పార్టీలోనే విమర్శలు వస్తుండడం గమనార్హం.