గత ఏడాది కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ నానా తిప్పలు పడుతుంటే….ఏపీ సీఎం జగన్ మాత్రం కరోనా ఓ సాధారణ జలుబు వంటిదని, పారాసిటమాల్ వేసుకొని బ్లీచింగ్ చల్లితే సరిపోతుందని తేల్చిపడేశారు. జగన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది. ఆ తర్వాత ఆలస్యంగా జగన్ మేలుకొనే సరికి ఏపీలో కరోనా కూచిపూడి ఆడేసింది.
రోజుకు 10వేల కేసులతో మహారాష్ట్ర తర్వాత స్థానంలో ఏపీ నిలవడం ఏపీ ప్రజలను కలవరపెట్టింది. జగన్ కరోనాను లైట్ తీసుకోవడం వల్లే ఏపీలో చాలామంది ప్రాణాలు కోల్పోయారని విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలనుంచి జగన్ పాఠాలు నేర్వలేదని తాజా ఘటనతో తేటతెల్లమైంది. ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ తో రోజురోజుకు కేసులు పెరుగుతుంటే…జగన్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
మాస్కు లేకుంటే ఫైన్ అంటూ డబ్బులు దండుకోవడంపై శ్రద్ధపెట్టిన జగన్….కరోనాను కట్టడి చేయడంలో కీలకమైన పాత్ర పోషించిన, పోషించబోతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ ను నిర్దాక్షిణ్యంగా విధుల నుంచి తొలగించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్ రెడ్డిపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు.
సెకండ్ వేవ్ ప్రభావిత రాష్ట్రాల్లో ఏపీ ఉందని, కానీ, రెండో దశలోనూ జగన్ అలసత్వం ఏపీ ప్రజలకు శాపంగా మారిందని దుయ్యబట్టారు. తొలి దశలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన కరోనా వారియర్స్‌కు నెలల తరబడి జీతాలు చెల్లించని జగన్…తాజాగా విధుల్లో నుంచి తొలగించడం దారుణమని పట్టాభి ధ్వజమెత్తారు. పక్క రాష్ట్రాల్లో ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు పూలాభిషేకం చేస్తే…జగన్ వారికి రిక్తహస్తాలు చూపించారని విమర్శించారు.
ఒక్క వాట్సాప్ మెసేజ్‌తో వారియర్స్‌ను విధుల్లో నుంచి తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. తమ జీతాల కోసం పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్‌పై గుంటూరులో లాఠీచార్జ్ చేయడం దుర్మార్గమన్నారు. వారియర్స్ ను విధుల్లోకి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపడతామని పట్టాభిరామ్ వార్నింగ్ ఇచ్చారు.
కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ఇంత మంది విధుల్లో లేకుండా పోతే జనం పరిస్థితి ఏంటని నిలదీశారు. జగన్ నిర్లక్ష్యం వల్ల తొలిదశలోనూ వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు. భవిష్యత్తులో కరోనా వల్ల ఎవరి ప్రాణాలు పోయినా, కరోనా కేసులు పెరిగా దానికి పూర్తి బాధ్యత సీఎం జగన్ రెడ్డే వహించాలని హెచ్చరించారు.