డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తొలగింపుపై కొడాలి నాని, వల్లభనేని వంశీలకు టీడీపీ నేత పట్టాభి సవాల్ విసిరారు. తమకు ఎన్టీఆర్ అంటే అభిమానమని చెప్పే ఆ ఇద్దరు నేతలు తాడేపల్లి ప్యాలస్ ముందు ధర్నా చేసే దమ్ముందా? అని పట్టాభి ప్రశ్నించారు. యూనివర్సిటీకి పేరు మార్చిన విషయంలో జగన్ దుర్మార్గాన్ని వారు ప్రశ్నించగలరా అని నిలదీశారు. ఆ ఇద్దరికీ ఎన్టీఆర్ పేరును కూడా ఉచ్ఛరించే అర్హత లేదని పట్టాభి ఫైర్ అయ్యారు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన తొలిరోజే యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు పెడతామని పట్టాభి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయో కూడా ముఖ్యమంత్రి జగన్ కు తెలియకపోవడం దారుణమని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 13 మెడికల్ కాలేజీలు ఉన్నాయని ఏ2 విజయసాయిరెడ్డికి కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చిందని పట్టాభి గుర్తు చేశారు. వాటిలో చంద్రబాబు హయాంలో వచ్చినవి నాలుగున్నాయని చెప్పారు.
ఇవేమీ తెలియని జగన్ మాత్రం 17 మెడికల్ కాలేజీలున్నాయంటూ అబద్ధాలు చెబుతూ గొప్పలు పోతున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ పేరును మార్చుతూ అసెంబ్లీలో బిల్లు తీసుకురావడం రాష్ట్ర చరిత్రలో ఒక చీకటి రోజు అని పట్టాభి అభివర్ణించారు. కరోనా సమయంలో రోగులకు ఆక్సిజన్ అందించలేక 110 మంది ప్రాణాలను బలితీసుకున్న జగన్ కు ఆరోగ్యం గురించి మాట్లాడే అర్హత లేదని పట్టాభి షాకింగ్ కామెంట్లు చేశారు.
మరోవైపు, ఎన్టీఆర్ పేరును తొలగించడాన్ని సీపీఐ నేత నారాయణ తప్పుపట్టారు. తన తండ్రి పేరు పెట్టుకోవాలని జగన్ అనుకుంటే రాష్ట్రంలో ఎన్నో యూనివర్శిటీలు, కాలేజీలు ఉన్నాయని… కావాలంటే వాటికి వైఎస్సార్ పేరు పెట్టుకోవచ్చని అన్నారు. అసలు పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. యూనివర్శిటీ పేరును మార్చడం ద్వారా జగన్ ఒక దారుణమైన సంస్కృతికి తెరలేపారని విమర్శించారు.
తమిళనాడులో జరిగే ఘటనలను గుర్తు చేస్తూ ఏపీ సర్కారు తీరును సీబీఐ మాజీ జేడీ, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వి వి లక్ష్మీనారాయణ విమర్శించారు. సీఎం స్టాలిన్ మాజీ సీఎం జయలలిత బొమ్మలతో ఉన్న స్కూల్ బ్యాగులను పంపిణీ చేసి, తన ఔన్నత్యాన్ని చాటారని లక్ష్మీనారాయణ గుర్తు చేశారు. అయినా, పేరు మార్పు కాదు… వ్యవస్ధల రిపేరు కావాలంటూ లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.