పుష్కర కాలానికి పైగా సరైన హిట్టు లేక ఇబ్బంది పడుతున్నాడు షారుఖ్ ఖాన్. ఆయనకు ఒక మోస్తరు హిట్ పడితే చూడాలని ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు అభిమానులు. ‘పఠాన్’ సినిమా అయినా ‘సక్సెస్ ఫుల్’ అనిపించుకుంటే చాలని అనుకున్నారు. కానీ వాళ్లు కోరుకున్నదానికి ఎన్నో రెట్ల విజయం సాధించిందీ చిత్రం. అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తేనే ఓపెనింగ్స్ భారీగా రాబోతున్నాయని అర్థమైంది.
ఇక రిలీజ్ తర్వాత ఈ సినిమా ప్రభంజనం గురించి ఎంత చెప్పినా తక్కువే. రోజుకు వంద కోట్ల చొప్పున కొల్లగొడుతూ తొలి ఐదు రోజుల్లోనే ఏకంగా రూ.500 కోట్ల క్లబ్బులోకి అడుగు పెట్టేసింది ‘పఠాన్’. సోమవారం వసూళ్లు డ్రాప్ అయ్యాయి కానీ.. మరీ ఎక్కువేమీ కాదు. ఈ వారం, వచ్చేవారం హిందీంలో చెప్పుకోదగ్గ రిలీజ్లు ఏమీ లేకపోవడం ‘పఠాన్’కు కలిసొచ్చే విషయమే. దీంతో కొత్త శిఖరాల వైపు ‘పఠాన్’ చూస్తోంది.
ఇండియాలో ఇప్పటిదాకా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం ‘దంగల్’. ఆ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.2 వేల కోట్ల వసూళ్లు రాబట్టింది. తర్వాతి స్థానంలో ‘బాహుబలి-2’ ఉంది. ఆ చిత్రం రూ.1750 కోట్ల దాకా కలెక్షన్లు కొల్లగొట్టింది. ఐతే ‘దంగల్’ ఇండియాలో రిలీజైన కొన్ని నెలలకు చైనాలో విడుదల చేస్తే అక్కడ మాత్రమే రూ.1200 కోట్లు రాబట్టింది. అదొక స్పెషల్ కేస్. ఫస్ట్ రిలీజ్లో ఇప్పటిదాకా ఏ హిందీ చిత్రం కూడా రూ.1000 కోట్ల వసూళ్ల మార్కును అందుకోలేదు. ఈ క్లబ్బులో దక్షిణాది చిత్రాలైన బాహుబలి-2, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 మాత్రమే ఉన్నాయి.
‘పఠాన్’ ఇప్పుడు ఆ క్లబ్బులోకి అడుగు పెట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ చిత్ర వసూళ్లు రూ.600 కోట్ల మార్కును దాటేసినట్లు తెలుస్తోంది. ఈ వీకెండ్, తర్వాతి వీకెండ్లో సినిమా నిలకడగా వసూళ్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. అనుకోకుండా వసూళ్లు డ్రాప్ అయితే తప్ప ఫుల్ రన్లో ‘పఠాన్’ వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్కును అందుకోవడానికి అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి.