ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాతో పాటు విదేశాల్లో స్థిరపడిన వారి సంఖ్య గణనీయంగానే ఉందన్న సంగతి తెలిసిందే. మంచి జీతం, ఉజ్వల భవిష్యత్తు, మెరుగైన జీవన ప్రమాణాలు ఉండడంతో చాలామంది తమ డాలర్ డ్రీమ్స్ నెరవేర్చుకునేందుకు అమెరికా వంటి దేశాలలో స్థిరపడుతున్నారు. ఇక, ఇలా స్థిరపడిన ఎన్నారైలలో పెళ్లికాని బ్యాచ్ లర్ లకు మంచి డిమాండ్ ఉంది. అందుకే, ఎన్నారై సంబంధాల కోసం అమ్మాయిల తల్లిదండ్రులు లక్షలకు లక్షలు కట్నాలు ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు.
అయితే, పెళ్లైన తర్వాత కొందరు ఎన్నారైలు తమ భార్యలను హింస పెట్టడం, అదనపు కట్నం కోసం ఇండియాలో భార్యలను వదిలేసి వెళ్లడం వంటివి చేస్తున్నారు. ఇటువంటి ఎన్నారై భర్తలపై రాష్ట్రంలో వేల సంఖ్యలో గృహహింస కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ కేసులు ఎదుర్కొంటున్న ఎన్నారై అల్లుళ్లు…ఎంచక్కా విదేశాలలోనే ఉంటూ స్వదేశానికి రాకుండా తప్పించుకుంటున్నారు. ఒకవేళ వచ్చినా…ఎవరికీ తెలీకుండా పని ముగించుకొని విదేశాలకు చెక్కేస్తున్నారు.
అలా అని వారిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసేంత పెద్ద కేసు కాబట్టి వారి విషయంలో ఏం చేయాలో పాలుపోక తెలంగాణ, ఏపీ పోలీసులు తలలుపట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆ తరహా ఎన్నారై అల్లుళ్లకు షాకిచ్చేందుకు తెలంగాణ పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నారై అల్లుళ్ల ఆగడాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన పోలీసుల శాఖ…వారి పాస్‌పోర్టుల రద్దుకు సిఫారసు చేయాలని భావిస్తోంది.
యుఎస్ కాన్సులేట్‌తో ఇటీవలే సమావేశమైన పోలీసు శాఖ వారి సహకారం కోరింది. ఇందుకు యుఎస్ కాన్సులేట్ కూడా అంగీకరించింది. దీంతో, పోలీసులు కార్యచరణ రూపొందింస్తున్నారు. తీవ్రత ఎక్కువ ఉన్న కేసుల్లో పాస్‌పోర్టుల రద్దుకు పోలీసు శాఖ నుంచి సిఫారసు అందితే.. పరిశీలిస్తామని సికింద్రాబాద్ పాస్ పోర్టు కార్యాలయ అధికారులు పోలీసులకు హామీ ఇచ్చారని తెలుస్తోంది. గృహహింసతో పాటు ప్రవాసులపై నమోదైన ఇతర కేసుల్లో ఇప్పటివరకు 15 మంది పాస్‌పోర్టులు మాత్రమే రద్దు చేశారు. తాజాగా పోలీసుల నిర్ణయంతో ఆ సంఖ్య పెరిగే అవకాశముంది.