మహేష్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘గుంటూరు కారం’ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. సంక్రాంతి లాంటి క్రేజీ సీజన్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయడం, టికెట్ల ధరలు ఎక్కువ ఉండడం వల్ల ఓపెనింగ్స్ ఘనంగా రావడంతో సినిమా యావరేజ్ రిజల్ట్ అందుకుంది కానీ.. వచ్చిన టాక్ ప్రకారం చూస్తే డిజాస్టర్ అవ్వాల్సిన మూవీనే ఇది. త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్లో వచ్చిన చివరి సినిమా ‘ఖలేజా’ డిజాస్టర్ అయినప్పటికీ.. దర్శకుడిగా త్రివిక్రమ్ ప్రయత్నం ప్రశంసలందుకుంది.
కాల క్రమంలో అది కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. కానీ ‘గుంటూరు కారం’ మాత్రం విమర్శకుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఇది త్రివిక్రమ్ స్థాయికి తగని చిత్రం కాదనే అభిప్రాయాలు సర్వత్రా వినిపించాయి. కథ విషయంలో త్రివిక్రమ్ సరైన కసరత్తు చేయలేదని.. తన సినిమాలనే అటు ఇటు తిప్పి.. కొంత మసాలా యాడ్ చేసి వదిలేశాడనే విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి.
పెద్ద సినిమాల థియేట్రికల్ రన్ పూర్తయ్యాక వాటి మీద పోస్టుమార్టం నిర్వహించే లెజెండరీ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ తన యూట్యూబ్ ఛానెల్ ‘పరుచూరి పలుకులు’లో తాజాగా ‘గుంటూరు కారం’ మీద విశ్లేషణ చేశారు. ఈ సినిమా తనకు నచ్చలేదనే విషయాన్ని ఆయన సున్నితంగా చెప్పారు. త్రివిక్రమ్ తన ఫేవరెట్ రైటర్-డైరెక్టర్ అని.. ఆయన్నుంచి ఆశించే పనితనం ఈ సినిమాలో కనిపించలేదని ఆయనన్నారు. ఈ సినిమా టైటిల్‌కు, కథకు సంబంధం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
‘గుంటూరు కారం’ అని పెట్టి ఒక మాస్ మూవీలా ప్రొజెక్ట్ చేశారని.. కానీ సినిమాలో మాత్రం కుటుంబ కథను చెప్పారని.. ఈ కథకు ‘గుంటూరు కారం’ అని కాకుండా ‘గుంటూరు అబ్బాయి’ అని పెట్టి ఉంటే ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకునేవారని ఆయనన్నారు. త్రివిక్రమ్ మామూలుగా మంచి టైటిళ్లు పెడతారని.. కానీ ఈ సినిమా పేరు మాత్రం తేడాగా అనిపించిందని ఆయనన్నారు. ‘గుంటూరు కారం’ మహేష్ స్థాయి సినిమా కాదని.. ఇందులో కథనం కన్ఫ్యూజింగ్గా అనిపించిందని.. తల్లి కొడుకు సెంటిమెంట్ సరిగా పండలేదని పరుచూరి అన్నారు. త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ కాబట్టి డబ్బులు వస్తాయని.. కానీ డబ్బులు రావడం వేరు, సంతృప్తి కలగడం వేరని చెబుతూ.. త్రివిక్రమ్ ఈసారి మంచి కథతో వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు పరుచూరి.