పరుచూరి బ్రదర్స్..టాలీవుడ్ లో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్. కథ అయినా…మాటలైనా..అదిరిపోయే డైలాగులైనా….తమ కలంతో ఎందరో హీరోలకు తిరుగులేని ఖ్యాతిని తెచ్చిపెట్టిన ఘనత ఈ సోదరులదే. కథ, మాటల రచయితలుగానే కాకుండా మంచి నటులుగా కూడా వీరిద్దరూ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాల నుంచి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉన్న పరుచూరి బ్రదర్స్ ఏనాడూ రాజకీయాలు, వివాదాల జోలికి పోలేదు.
గత కొంతకాలంగా వీరు సినిమాలలోనూ పెద్దగా కనిపించడకపోవడంతోపాటు మీడియాకు కూడా దూరంగా ఉంటున్నారు. గతంలో తన ఓ యూట్యూబ్ ఛానెల్ ద్వారా పరుచూరి గోపాల కృష్ణ తన అనుభవాలను పంచుకునేవారు. అటువంటిది నేపథ్యం ఉన్న పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన పరుచూరి గోపాల కృష్ణ తాజాగా ఏపీ రాజకీయాలపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు.
జనసేనాని పవన్ కల్యాణ్ చట్టసభల్లో అడుగుపెట్టాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని పరుచూరి అన్నారు. ఏదో ఒక పార్టీలో చేరి పార్లమెంటుకో, అసెంబ్లీకో వెళ్లే ఆలోచన వేరని, యావత్ సమాజాన్నే మార్చాలన్న ఆశయాన్ని కలిగి ఉండటం వేరని పరుచూరి చెప్పారు. ఆ బలమైన ఆశయం పవన్ లో ఉందని పరుచూరి కితాబిచ్చారు. ఎన్నికల్లో నిలబడగానే గెలిచేస్తాం, సీఎం అయిపోతామనేది తర్వాతి విషయమని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తన అభిప్రాయం చెప్పారు.
తన వెనుక ఎవరు వచ్చినా, ఎవరు రాకపోయినా పోరాడేవావాడే వీరుడని, పవన్ కూడా వీరుడేనని పొగడ్తలతో ముంచెత్తారు. పవన్ తన వాయిస్ ను చట్ట సభల ద్వారా వినిపించాలని కోరుకుంటున్నానని అన్నారు. పవన్ మనసు తనకు బాగా తెలుసని, మనకంటే ఎక్కువగా ప్రపంచం గురించి పవన్ కే తెలుసని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పపన్ గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టాలని పరుచూరి ఆకాంక్షించారు.