తమ ప్రభుత్వంలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్నామని, నాడు-నేడు కార్యక్రమంతో ప్రభుత్వ బడుల రూపు రేఖలు మారుస్తున్నామని వైసీపీ నేతలు గొప్పలు చెబుతోన్న సంగతి తెలిసిందే. అయితే, జగన్ సర్కార్ మాటలకు చేతలకు అస్సలు పొంతన ఉండడం లేదని విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎయిడెడ్ పాఠశాలల విలీనం నిర్ణయం ఇందుకు నిదర్శనమని దుయ్యబడుతున్నాయి.
ఈ క్రమంలోనే జగన్ సర్కార్ కు ఎయిడెడ్ సెగ రాష్ట్రమంతా తగులుతోంది. మొన్న విశాఖలో ఎయిడెడ్ పాఠశాలల విలీనానికి వ్యతిరేకంగా విద్యార్థులు, తల్లిదండ్రులు నిరసన తెలిపారు. ఇదే బాటలో తాజాగా కాకినాడలోనూ విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డెక్కారు. కాకినాడలోని సెయింట్ ఆన్స్ బాలికోన్నత పాఠశాల విలీనంపై ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలోనే స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి షాక్ తగిలింది.
వేరే కార్యక్రమంలో పాల్గొనేందుకు అటువైపుగా వెళుతున్న చంద్ర శేఖర్ రెడ్డిని తల్లిదండ్రులు దాదాపు గంట సేపు ఘెరావ్ చేశారు. పాఠశాల మూసివేతపై ఎమ్మెల్యేను చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. 40 ఏళ్ల నుంచి ఎందరికో చదువు చెప్పిన ఈ పాఠశాలను ప్రభుత్వం విలీనం చేయాలనడంపై వారు మండిపడ్డారు. ఆ పాఠశాలలో దశాబ్దాలుగా ఫీజు తీసుకోకుండా చదువు చెబుతున్నారని, కానీ, విలీన ప్రక్రియలో భాగంగా ఎయిడెడ్ నిధులు నిలిపివేయడంతో రూ.15 వేలు ఫీజు కట్టమంటున్నారని ఎమ్మెల్యే దగ్గర వాపోయారు.
అయితే, వారికి సర్ది చెప్పేందు ద్వారంపూడి ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ‘అమ్మఒడి మాకొద్దు’ అంటూ ఎమ్మెల్యేను కదలనీయకుండా నినాదాలు చేశారు. వారిని నియంత్రించేందుకు పోలీసులు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో, చేసేదేమీ జిల్లా విద్యాశాఖాధికారిని అక్కడకు హుటాహుటిన ద్వారంపూడి పిలిపించారు. స్కూలు ఫీజు కింద ఒక్కరూపాయి కూడా కట్టాల్సిన పనిలేదని..న్యాయం చేస్తానని, సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్తానని నచ్చచెప్పి ద్వారంపూడి అక్కడి నుంచి బయటపడ్డారు.