సంబంధం లేని పిచ్చి వాగుడుతో భారత్ ను కించపరిచేలా మాట్లాడటం చూస్తే.. పాక్ మాజీ క్రికెటర్ల మాటల్లో అసూయ ద్వేషాలు, కుళ్లు మితిమీరినట్టు అర్థమవుతోంది. వారి మాటలు భారతీయులకే కాదు పరాయి వారికి కూడా ఎబ్బెట్టుగా అనిపించాయి. భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ టోర్నీలో పాక్ జట్టు పేలవ ప్రదర్శన.. లీగ్ దశలో తొమ్మిది మ్యాచ్ ల్లో ఐదు మ్యాచుల్లో ఓడిన నేపథ్యంలో బాబర్ సేన సెమీస్ కు చేరుకోలేక చతికిలపడటం.. ఇంటికి పోవటం తెలిసిందే.
కట్ చేస్తే.. తాజాగా పాక్ క్రికెట్ జట్టు పేలవ ప్రదర్శన మీద కరాచీ వేదికగా ఒక చర్చా కార్యక్రమాన్నిచేపట్టారు. ఈ క్రమంలో పాక్ జట్టు మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ నోటి నుంచి వచ్చిన లేకి మాటలు షాకిచ్చేలా మారాయి. సందర్భానికి ఏ మాత్రం సూట్ కాని రీతిలో భారత నటి ఐశ్వర్యరాయ్ ప్రస్తావన తీసుకొచ్చి.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ‘‘ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ ను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే మంచిదే. కానీ.. పవిత్రమైన పిల్లలు పుట్టాలని కోరుకోవటం తప్పే అవుతుంది. అది ఎప్పటికీ జరగదు’’అంటూ నోటికి వచ్చినట్లుగా కారు కూతలు కూశాడు.
అతడి పిచ్చి వాగుడుకు బ్రేకులు వేసి.. సంస్కారంగా మాట్లాడాలన్న మాట చెప్పాల్సిన తోటి మాజీ క్రికెటర్లు షాహీద్ ఆఫ్రిదీ.. ఉమర్ గుల్.. అతడి వాగుడుకు నవ్వుతూ చప్పట్లు కొట్టటం చూస్తే.. వీరి లేకితనం.. ఉన్మాదం.. భారత మహిళా సెలబ్రిటీని కించపరిచే విధానం చూస్తే.. వీరికి ఇదేం పోయే కాలమన్న భావన కలగక మానదు. అబ్దుల్ రజాక్ చేసిన వ్యాఖ్యలపై భారత క్రికెట్ అభిమానులే కాదు.. మనసున్న మనసులంతా తీవ్రంగా స్పందిస్తున్నారు.
పాక్ క్రికెటర్ల వక్ర బుద్ధి మారదా? అని ప్రశ్నిస్తున్నారు. భారత్ కు వచ్చిన పాక్ ఆటగాళ్లకు ఘనమైన మర్యాదలు చేస్తే.. తిరిగి వారు ఇంత దారుణంగా మాట్లాడతారా? అన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ పిచ్చి వాగుడుకు సంబంధం ఉన్న ముగ్గురు మాజీ క్రికెటర్ల ముక్కును నేలకు రాయించాల్సిందేనన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.