ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు P4 అనే కాన్సెప్ట్ ను ఎన్నికల ముందు నుంచీ చెబుతున్నారు. ఈ ఉగాది నుంచి అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి “ మార్గదర్శి – బంగారు కుటుంబం” అని పేరు పెట్టారు. ఇది ప్రభుత్వ పథకం కాదు. ప్రభుత్వం నుంచి పైసా మంజూరు చేయాల్సిన అవసరం లేదు. డబ్బు ఉన్న వాళ్లు.. డబ్బు లేని పేద కుటుంబాలకు అండగా ఉండటం అన్న కాన్సెప్ట్ మీద దీన్ని సిద్ధం చేశారు. ఆ ప్రకారం పేదల్ని నమోదు చేశారు. ఇప్పుడు మాకు డబ్బులున్నాయి.. ఆదుకుంటాం అని ముందుకు వచ్చే వారిని ఎంపిక చేసి ఆయా కుటుంబాలను దాదాపుగా దత్తత ఇస్తారు.
ఈ స్కీమ్ కాన్సెప్ట్ ఎంత మందికి అర్థమవుతుంది ?
ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్దేశం పేద కుటుంబాలను పెద్ద కుటుంబాలు పోషించాలని కాదు. ఆ కుటుంబ సామాజిక, ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరిచేలా సాయం చేయడం. అంటే ఆయా కుటుంబాల్లో చదువుకునేవారు ఉంటే వారికి అవసరమైన సాయం చేయడం.. స్కిల్స్ తగ్గ పని చేయని వాళ్లు ఉంటే దానికి తగ్గ ఉపాధి కల్పించడం.. ఓ రకంగా చెప్పాలంటే.. గైడెన్స్ ఇవ్వడం. సరైన దారిలో ఆ కుటుంబాన్ని పయనించేలా చేసి అభివృద్ధి చెందేలా చేయడం. ఈ క్రమంలో కొంత మంది చదువులకు..ఇతర అవసరాలకు ఆర్థిక సాయం చేయవచ్చు. కానీ ఆ పేద కుటుంబాలు.. తమను ఇక ఆ పెద్ద కుటుంబాలు పోషిస్తాయని అనుకునే అవకాశం ఉంది. అక్కడే అసలు సమస్య వస్తుంది.
పథకాలకు అలవాటు పడిన ప్రజల్ని మార్చడం కష్టం !
చాలా సినిమాల్లో ఇప్పటికే అనేక సార్లు విమర్శనాత్మకంగా ప్రభుత్వం ఇచ్చే పథకాల గురించి చర్చించారు. ఓ నిరుపేద కుటుంబానికి.. ఇల్లు వస్తుంది..రేషన్ వస్తుంది.. నెలకు పింఛన్ వస్తుంది.. మళ్లీ వివిధ పథకాల నిధులు వస్తాయి. ఉద్యోగం లేకపోయినా.. పని చేయకపోయినా ఆ కుటుంబానికి ఢోకా ఉండదు. కానీ పని చేసుకునేవాడు మాత్రం రోజంతా కష్టపడి పన్నులు కట్టాల్సి వస్తుంది. అంటే పథకాలకు అలవాటుపడిపోయిన వారు పనులు చేయడానికి ఆసక్తి చూపించారు. వారు ఎదిగేందుకూ ఆసక్తి చూపించరు. అలాంటి వారిని ఈ P4 ద్వారా వృద్ధిలోకి తీసుకురావాలన్న ప్రయత్నం ఎంత మేర సక్సెస్ అవుతుందన్నది చర్చనీయాంశమే.
చంద్రబాబు ఆలోచన ఉత్తమం- ఫలితాలు అలాగే ఉంటే సామాజిక అభివృద్ధి!
చంద్రబాబు ఆలోచన అత్యుత్తమంగా ఉంది. పేదరికం అనేది శాపం. ఉచితంగా వచ్చేదాని మీద ఆధారపడకుండా సొంతంగా సంపాదించుకుంటూ పోతే అభివృద్ధి పెద్ద విషయం కాదు. కానీ చిన్న చిన్న జబర్దస్త్ ఆర్టిస్టులు వస్తున్నారంటే.. పోలోమంటూ వచ్చి వారిని చూసి.. రోడ్డంతా జామ్ చేసి పోయే వాళ్లు ఉన్న సమాజంలో.. చంద్రబాబు ఆలోచనను అర్థం చేసుకుని తాము అభివృద్ధి చెందేందుకు..ఎదిగేందుకు చంద్రబాబు డబ్బులన్నవాళ్లను నిచ్చెనలుగా పెడుతున్నాడని ..దాన్ని ఉపయోగించుకోవాలని అనుకునేవారు ఎందురు ఉంటారు?. అందుకే ఆ కాన్సెప్ట్ ను.. ముందుగా పేదలకు ఆదుకునేందుకు ముందుకు వచ్చేవారికి కాకుండా.. పేదలకు అవగాహన కల్పించేలా చేయాలి. లేకపోతే ఉన్నతమైన ఆలోచన నిర్వీర్యం అయిపోతుంది.