ప్రముఖ హోటల్ బుకింగ్ సంస్థ ఓయో(OYO) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై పెళ్లికాని వారికి నో ఎంట్రీ అంటోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన హోటల్ చైన్ ఓయో. ప్రయాణికులకు సౌకర్యవంతమైన, నాణ్యమైన స్టేను అందించడమే ఓయో లక్ష్యం. కానీ, ఇటీవల కాలంలో యువతీయువకులు ఏకాంతంగా గడపడానికి ఓయో రూమ్స్ అడ్డాగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఓయో కొత్త చెక్-ఇన్ పాలసీని తీసుకొచ్చింది.
ఇప్పటివరకు మేజర్స్ అంటే 18 సంవత్సరాలు నిండిన ఎవరైనా సరే ఆధార్ కార్డు చూపించి ఓయోలో రూమ్ బుక్ చేసుకోవచ్చు. కానీ ఇకపై అలా కుదరవు. పెళ్లికాని జంటలకు రూమ్ ఇచ్చేది లేదని ఓయో సీఈవో రితేశ్ అగర్వాల్ నిర్ణయించారు. తాజా రూల్స్ ప్రకారం.. ఇకనుంచి బుకింగ్ సమయంలోనే వివాహానికి సంబంధించి చెల్లుబాటు అయ్యే ఫ్రూఫ్ సమర్పించాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్ తో పాటు ఆన్లైన్ రూమ్ బుకింగ్ సమయంలో కూడా ఇది వర్తిస్తుంది.
పెళ్లిని నిర్ధారించే ఐడీ కార్డులు లేదా ఫోటో ప్రూఫ్ లేకుంటే బుకింగ్స్‌ను తిరస్కరించే అధికారాన్ని స్థానిక సామాజిక సెన్సిబిలిటీకి అనుగుణంగా భాగస్వామ్య హోటళ్లకు ఓయో అందిస్తోంది. ఈ మేరకు ఆదివారం కంపెనీ ప్రకటన చేసింది. సురక్షితమైన, బాధ్యతాయుతమైన ఆతిథ్య పద్ధతులను అమలు చేసేందుకు ఓయో ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా తెలిపింది,
ఇక తాజాగా ఓయో ప్రవేశపెట్టిన ఈ కొత్త చెక్-ఇన్ పాలసీని తొలిత మీరట్ లో స్టార్ట్ కానుంది. మీరట్‌లోని తన భాగస్వామ్య హోటళ్లకు తక్షణమే ఈ రూల్ ను అమల్లోకి తీసుకురావాలని సీఈవో రితేశ్ అగర్వాల్ నిర్దేశించారు. క్షేత్రస్థాయి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని మిగతా నగరాల్లోనూ దీన్ని అమలు చేయబోతున్నారు. అదే జరిగితే ఇకపై పెళ్లికాని జంటలకు ఓయోలో రూమ్ బుక్ చేసుకునే అవకాశం ఉండదు.