కరోనా మహమ్మారి దెబ్బకు అనామక రాజ్యం నుంచి అగ్రరాజ్యం అమెరికా వరకు చిగురుటాకులా వణికిపోయిన సంగతి తెలిసిందే. ట్రంప్ హయాంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల వేలాది మంది అమెరికన్లు కరోనా బారిన పడి మరణించగా…లక్షలాది మంది ఆస్పత్రులపాలయ్యారు. ఆస్పత్రులలో బెడ్ల కొరతతో లక్షలాది మంది ప్రజలు ఇళ్లలోనే వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి వచ్చింది. సెకండ్ వేవ్ దెబ్బ నుంచి మిగతా దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో అమెరికాలో థర్డ్ వేవ్ విజృంభించింది.
అగ్రరాజ్యంలో డెల్టా వేరియంట్ సునామీలా విరుచుకుపడడంతో ఆక్సిజన్ కొరతతో ఆ దేశ ప్రజలు విలవిలలాడిపోతున్నారు. సెకండ్ వేవ్‌లో భారత్ ఆక్సిజన్ కొరతతో కొట్టుమిట్టాడినట్లుగానే…అమెరికాలో ప్రస్తుతం ఆక్సిజన్ కు తీవ్రస్థాయిలో కొరత ఏర్పడింది. అమెరికాలో రోజుకు దాదాపు లక్షన్నర కేసులు నమోదవుతుండడం కలవరపెడుతోంది. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించినా, వ్యాక్సినేషన్ శరవేగంగా జరుగుతున్నప్పటికీ…పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గకపోవడం విశేషం.
ముఖ్యంగా ఫ్లొరిడా, సౌత్ కరోలినా, టెక్సాస్, లూసియానాలోని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బెడ్ల కోసం జనాలు బారులు తీరుతున్నారు. ఐసీయూలో బెడ్స్ అన్ని నిండిపోవడం, అందరికీ సరిపడా ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడం కలకలం రేపుతోంది. ఇక, కొన్ని ప్రాంతాల్లో అయితే రిజర్వ్ చేసిన ఆక్సిజన్ నిల్వలు వాడాల్సి వస్తోంది. 50 శాతం ఉండాల్సిన ఆక్సిజన్ నిల్వలు 20 శాతానికి పడిపోయాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పరిస్థితి ఇలాగే కొనసాగితే భారత్ తరహాలోనే అమెరికా కూడా ఆక్సిజన్ కోసం గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో, ఆక్సిజన్ నిల్వలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా సర్కార్…పెద్ద పెద్ద పరిశ్రమలకు వెళ్లే ఆక్సిజన్ నిల్వలను ఆస్పత్రులకు తరలించే ప్రయత్నాలు చేస్తోంది. డిసెంబరు నాటికి కొత్తగా లక్ష మరణాలు సంభవించే అవకాశం ఉందని ఆంటోనీ ఫౌచీ అంచనా వేస్తున్నారు. గత ఏడాది కాలంలో కరోనా మరణాలు 14 రాష్ట్రాల్లో 50శాతం పెరిగాయని వెల్లడైంది. దీంతో, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసి ముప్పును అరికట్టేందుకు బైడెన్ ప్రభుత్వం కొత్త ప్రణాళికలు రచిస్తోంది.