విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట ఎంఎల్ఏపై లోకల్ లీడర్లు తిరుగుబాటు మొదలుపెట్టారా ? క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే అనుమానంగా ఉంది. నియోజకవర్గంలోని ఎస్ రాయవరం మండలంలోని కొందరు వైసీపీ ప్రజా ప్రతినిధులు సమావేశమయ్యారు.
ఎంఎల్ఏ గొల్ల బాబురావు వ్యవహారశైలిపై మండిపోయారు. తమకు ఎంఎల్ఏ కనీస మర్యాద కూడా ఇవ్వటం లేదని, ఎంఎల్ఏ గెలుపుకు కష్టపడిన వారిని కాదని ఓడగొట్టేందుకు ప్రయత్నించిన వారినే ఇపుడు బాబురావు నెత్తిన పెట్టుకుంటున్నట్లు ద్వితీయ శ్రేణి నేతలు మండిపోయారు.
ఎంఎల్ఏ వ్యవహార శైలి కారణంగా తాము అధికార పార్టీలో ఉన్నామా ? లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నామా అని అర్ధం కావడం లేదంటు గోల పెట్టారు. బాబూరావుకు వ్యతిరేకంగా మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు సమావేశమయ్యారు. ఎంపీపీ శారదాకుమారి మాట్లాడుతూ ఎంఎల్ఏ వైఖరిపై మండిపడ్డారు. మండలంలోని కొందరికి పదవులు రాకుండా ఎంఎల్ఏ అడ్డుకుంటున్నట్లు ఆరోపించారు.
బాబూరావుకు టికెట్ వద్దని మూడు మండలాల్లోని నేతలు అడ్డుపడితే అప్పుడు టికెట్ ఇప్పించి గెలుపుకు కష్టపడిన రాయవరం నేతలు చేదుగా మారిపోయారా అంటూ శారదాకుమారి ప్రశ్నించారు. డబ్బు, కులానికి మాత్రమే ఇపుడు ఎంఎల్ఏ ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎంపీపీ రెచ్చిపోయారు. మొత్తానికి రాయవరం మండలంలోని కొందరు ప్రజా ప్రతినిధులు బహిరంగంగానే వ్యతిరేకమైనట్లు అర్ధమవుతోంది. ఇప్పటికే నగరిలో రోజా అంటే పడని వర్గం బలంగా తయారైన విషయం తెలిసిందే.
నియోజకవర్గంలో రోజాకు సమాంతరంగా వ్యతిరేక వర్గం కార్యక్రమాలు చేస్తోంది. రెగ్యులర్ గా మీటింగులు పెట్టుకుంటున్నారు. ఎంఎల్ఏతో నువ్వెంతంటే నువ్వెంత అనే స్ధాయిలో వ్యతిరేక వర్గం బలంగా తయారైంది. చూడబోతే పాయకరావుపేటలో కూడా తొందరలో వ్యతిరేకత వర్గం అలాగే తయారయ్యేట్లుంది. మరి ఒక్కోవర్గంలో ఎంఎల్ఏకి వ్యతిరేకవర్గం తయారైతే పార్టీకి కష్టమే అని చెప్పక తప్పదు.