సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ పేరు ఈ మధ్య తరచూ వార్తల్లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పిన బండ్ల గణేష్…ఆ పార్టీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. అదలా ఉండగానే, గతంలో చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ పై కేసు నమోదైంది. తాజాగా ఆ కేసులో ఆయనకు ఏడాది పాటు జైలు శిక్ష విధించిన వైనం సంచలనం రేపుతోంది. బండ్ల గణేష్ కు ఒంగోలులోని కోర్టు ఏడాదిపాటు జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.
అంతేకాకుండా, ఫిర్యాదుదారుడి నుంచి అప్పుగా తీసుకున్న 95 లక్షల రూపాయలను వెంటనే చెల్లించాలని కోర్టు ఖర్చులు కూడా అతడికి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో, బండ్ల గణేష్ కు షాక్ తెగినట్లు అయింది. 2019లో మద్దిరాలపాడుకు చెందిన జానకిరామయ్య దగ్గర బండ్ల గణేష్ 95 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారు. జానకిరామయ్య చనిపోయిన తర్వాత ఆయన తండ్రికి 95 లక్షల రూపాయల చెక్కును బండ్ల గణేష్ ఇచ్చారు.
అయితే, ఆ చెక్ బౌన్స్ కావడంతో జానకిరామయ్య ఒంగోలు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే విచారణ జరిపిన కోర్టు అప్పు మొత్తం చెల్లించాలని ఆదేశించింది. ఇక, గతంలో హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ కోర్టు కూడా బండ్ల గణేష్ కు 6 నెలల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. టెంపర్ సినిమాకు కథను అందించిన దర్శకుడు వక్కంతం వంశీ దాఖలు చేసిన చెక్ బౌన్స్ కేసులో 15 లక్షల జరిమానాతోపాటు 6 నెలల జైలు శిక్ష విధించింది.