సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పార్టీలో ఉన్న ముఖ్య నేతలంతా ఒకరి తర్వాత ఒకరు జగన్ కు గుడ్ బై చెప్పేసి కూటమి పార్టీల్లో చేరిపోతున్నారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతోంది. ఇటీవల ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా పూర్తిగా కూటిమి వైపు మొగ్గు చూపింది. అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థలు భారీ మెజారిటీతో గెలుపొందారు. జగన్ సారథ్యంలోని వైసీపీ కనీసం అక్కడ ఖాతా తెరవలేకపోయింది.
ఎన్నికల హడావుడి ముగిశాక జిల్లాలో క్రియాశీలక నాయకులంతా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు, మాజీ మంత్రి ఆళ్ల నాని ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి మరియు పార్టీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో క్యాడర్ సైతం ఆందోళనలో పడింది. ఇంతలోనే జగన్ కు షాక్ ఇచ్చేందుకు మరో బిగ్ వికెట్ రెడీ అవుతోందట. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పాలని భావిస్తున్నారట.
కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన గ్రంథి శ్రీనివాస్.. 2011లో వైసీపీ కండువా కప్పుకున్నారు. పార్టీ ఆవిర్భావం నుండి ఉన్న గ్రంథి.. 2014లో జరిగిన ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గం నుండి సమీప ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ పై గెలుపొందిన గ్రంథికి మంత్రి పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. కానీ జగన్ క్యాబినెట్ లో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు.
అప్పటి నుంచి తీవ్ర అసంతృప్తిలో ఉన్న గ్రంథి శ్రీనివాస్.. ఈ ఎన్నికల్లో భీమవరం నుంచి మరోసారి పోటీలోకి దిగి భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పటి నుంచి వైసీపీతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్న గ్రంథి శ్రీనివాస్.. త్వరలోనే వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరే ఆలోచనలో ఉన్నారంటూ ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. ఇటీవల వరదల సమయంలో సోదరుడితో కలిసి గ్రంథి శ్రీనివాస్.. సీఎం చంద్రబాబును మీట్ అయ్యారు. కోటి రూపాయిలు విరాళంగా అందజేశారు. దీంతో ఆయన పార్టీ మారబోతున్నారనే ప్రచారం మరింత ఊపందుకుంది.