మాజీ మంత్రి కొడాలి నాని కి తాజాగా ఓ లా-స్టూడెంట్ బిగ్ షాకిచ్చింది. వైసీపీ ప్రభుత్వ హాయంలో నోటికి హద్దు అదుపు లేకుండా కూటమి నేతలను మరియు వాటి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని కొడాలి నాని ఎటువంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాధ్యతాయుత మంత్రి పదవిలో ఉన్నానన్న విషయాన్ని కూడా మరచి బూతుల పురాణంతో రెచ్చిపోయారు. కట్ చేస్తే.. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీకి రెక్కలు ఎగిరిపోయాయి. కూటమి పార్టీ రూలింగ్ లోకి వచ్చింది.
ఎన్నికల ఫలితాల తర్వాత కొడాలి నానికి చిక్కులు ప్రారంభం అయ్యాయి. ఆయనపై వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా విశాఖ నగరానికి చెందిన లా విద్యార్థిని సత్యాల అంజన ప్రియ.. కొడాలి నానిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వైకాపా హయాంలో కొడాలి నాని వాడిన భాషను అంజన ప్రియ ఖండించారు. మీడియాలో, సోషల్ మీడియాలో చంద్రబాబు, నారా లోకేష్‌పై అవమానకరమైన రీతిలో కొడాలి నాని అసభ్య పదజాలం ఉపయోగించారని, వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని అంజన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇష్టమొచ్చినట్లు దుర్భాషలాడుతూ వారి వ్యక్తిగత గౌరవాన్ని, కుటుంబ ప్రతిష్ఠను కొడాలి దెబ్బతీశారని అంజన ఫిర్యాదు చేశారు.
ఒక మహిళగా, లా విద్యార్థిగా కొడాలి నాని బూతుల పురాణం సహించలేకపోయానని.. ఆయన అసభ్య పదజాలం తనను తీవ్ర ఆవేదన కలిగించాయని అంజన తెలిపారు. ఇలాంటివారి విషయంలో నిర్లక్ష్యం వహిస్తే యువత వీరినే ఆదర్శంగా తీసుకునే ప్రమాదం ఉందన్నారు. సోషల్ మీడియా, బహిరంగ వేదికలపై ఈ విధంగా దూషించే పదజాలం, అవమానకరమైన వ్యాఖ్యలు ఉపయోగించడం వల్ల ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటాయని అంజన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని కొడాలి నానిపై తగిన చర్యలు చేపట్టాలని అంజన కోరారు. ఆమె ఫిర్యాదు మేరకు విశాఖపట్నం 3వ పట్టణ పోలీసు స్టేషన్లో కొడాలి నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.