ప్రభుత్వం ఉదాసీనత, అధికారుల అలసత్వం వల్ల క్వారీలలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్న వైనంపై విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. కొందరు ప్రభుత్వ పెద్దల అండతో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా క్వారీలు, సున్నపు భట్టీలు నడుపుతున్నారని, దీంతో అక్కడ పేలుళ్లు, ప్రమాదాలు సంభవిస్తున్నాయని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.
ఇటీవల సీఎం జగన్ సొంత జిల్లా కడపలోని కలసపాడు మండలంలో మామిళ్లపల్లె గ్రామ శివారులో ముగ్గురాళ్ల గనిలో పేలుడు జరిగిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో ముగ్గు రాళ్ల గనిలో ఉన్న 10 మంది కూలీలు ఘటనాస్థలంలోనే మృతి చెందడం సంచలనం రేపింది. ఆ ఘటనను మరువక ముందే తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత క్వారీలో పేలుడు ఘటక కలకలం రేపుతోంది.
ఈ ఘటనలో ఒకరు మృతి చెందడం దుమారం రేపింది. చిత్తూరు జిల్లాలోని చౌడేపల్లి మండలం కడియాలకుంట అంకాలమ్మ కొండ వద్ద మంత్రికి చెందిన క్వారీలో బాంబు పేలుళ్ల దాటికి ఒకరు బలయ్యారు. పేలుళ్ల ధాటికి బండరాళ్లు సుమారు అర కిలోమీటర్ దూరం ఎగిరిపడ్డాయి. ఈ క్రమంలోనే చౌడేపల్లిలోని తిరుపతి ప్రధాన రహదారిలో వెళుతున్న మామిడికాయల ట్రాక్టర్‌పై బండరాళ్లు పడ్డాయి. దీంతో, ట్రాక్టర్ లో ఉన్న జాకీర్ (25)అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు.
అయితే, క్వారీలో బ్లాస్టింగ్ జరగబోతోందని…క్వారీకి దూరంగా వెళ్లాలని మామిడితోటల యజమానులను క్వారీ సిబ్బంది హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఇప్పటికైన ప్రభుత్వం క్వారీలు, సున్నపు భట్టీల విషయంలో కొరడా ఝుళిపించాలని, ప్రభుత్వ పెద్దలు నడుపుతున్న క్వారీలపైనా విజిలెన్స్ దాడులు నిర్వహించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.