తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పాలని వైఎస్ షర్మిల వ్యూహాలు రచిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్న షర్మిల….టీఆర్ఎస్ సర్కార్ పై సందర్భానుసారంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు చాలాకాలం నుంచి పెండింగ్ లో ఉన్నాయిని, వాటిని తక్షణమే విడుదల చేయాలంటూ షర్మిల డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి మూడు రోజులపాటు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష చేపట్టబోతున్నారు. అయితే, ఇందిరాపార్క్ వద్ద షర్మిల దీక్షకు పోలీసులు షాకిచ్చారు. కేవలం ఒక్కరోజు మాత్రమే అదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే దీక్ష చేసేందుకు హైదరాబాద్ పోలీసులు అనుమతులివ్వడంతో షర్మిలకు షాక్ తగిలినట్లయింది.
పోలీసులు అనుమతివ్వకపోయినా…షర్మిల 3 రోజులపాటు నిరాహార దీక్ష చేస్తారా లేక ఒక్కరోజుతో సరిపెడతారా అన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో కొత్త పార్టీని ప్రారంభించనున్న షర్మిల దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 9న ఖమ్మంలో భారీ బహిరంగసభను నిర్వహించిన షర్మిల…3 రోజుల దీక్ష చేస్తానని ఆనాడే ప్రకటించారు. షర్మిల నిరాహారదీక్ష నేపథ్యంలో, తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సాగర్ ఉపఎన్నికలపై ఈ దీక్ష ప్రభావం ఎంతవరకు ఉంటుందనే చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.