అమెరికాకు ఒమిక్రాన్ ఇచ్చిన షాకింగ్ షాక్: పెద్ద ఎత్తున ఆసుపత్రుల్లో చేరుతున్న చిన్నారుల
అంచనాలకు తగ్గట్లు వ్యవహరించటానికి అదేమీ మనం తయారు చేసిన ఆటబొమ్మ కాదు. కరోనా. ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసే ఈ మహమ్మారికి సంబంధించిన అంచనాలన్నీ అడ్డదిడ్డంగా ఫెయిల్ అయిన పరిస్థితి.
తాజాగా ఈ దుర్మార్గపు వైరస్ మరోసారి తనలోని మరో పాడు కోణాన్ని చూపించింది. వాయు వేగంతో వ్యాప్తి చెందటం తప్పించి.. ప్రాణాల మీదకు తీసుకొచ్చే లక్షణాలు పెద్దగా కనిపించని ఒమిక్రాన్ వేరియంట్ కు సంబంధించిన సరికొత్త షాక్ ప్రపంచానికి పెద్దన్న అయిన అమెరికాకు తగిలింది.
ఇప్పటివరకు ఆ దేశంలో పెద్ద ఎత్తున ఒమిక్రాన్ కేసులు నమోదు కావటం తెలిసిందే. అయితే.. ఇటీవల కాలంలో ఊహించని ట్విస్టు ఒకటి చోటు చేసుకుంది. ఈ వైరస్ అడుగు పెట్టిన తర్వాత ఎప్పుడూ లేని రీతిలో పెద్ద ఎత్తున చిన్నారులు ఆసుపత్రుల్లో చేరుతున్న వైనం ఇటీవల భారీగా పెరిగినట్లుగా గుర్తించారు. ఇదే అంశం ప్రభుత్వ గణాంకాలు సైతం స్పష్టం చేస్తున్నాయి. నిత్యం లక్షల్లో నమోదవుతున్న ఒమిక్రాన్ కేసులతో కొత్త వేరియంట్ దేశ వ్యాప్తంగా వేగవంతంగా విస్తరిస్తోంది.
ఐదేళ్ల లోపు చిన్నారుల్లో ప్రతి లక్ష మందిలో నలుగురు కంటే ఎక్కువ మంది చిన్నారులు తప్పనిసరిగా ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తోంది. అదే విధంగా ఐదేళ్ల నుంచి పదిహేడేళ్ల చిన్నారుల విషయంలో ఆ సంఖ్య ఒకటిగా ఉన్నట్లుగా గుర్తించారు.
మిగిలిన వయసుల వారితో పోలిస్తే.. చిన్నారులు ఆసుపత్రుల్లో చేరిక ఒక మోస్తరుగా ఉన్నా.. మహమ్మారి ప్రారంభమైన తర్వాత చిన్నారులు ఆసుపత్రుల్లో చేరుతున్న రేటు మాత్రం ఇప్పుడే అత్యధికమని సీడీసీ డైరెక్టర్ డాక్టర్ రాచెల్లె వాలెన్స్కీ వెల్లడించారు.
టీనేజర్లలో సగటున రోజుకు 766 మంది ఆసుపత్రుల్లో చేరారని.. రెండు వారాల క్రితం గణాంకాలతో పోలిస్తే ఇది రెట్టింపు సంఖ్యగా చెబుతున్నారు. అన్నింటికి మించి ఊబకాయం.. మధుమేహం.. ఊపిరితిత్తుల సమస్య ఎక్కువగా ఉన్న పిల్లల్లో ఈ మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉంటుందని ప్రముఖ వైద్య నిపుణుడు ఆంటోనీ ఫౌచీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఐదేళ్లలోపు పిల్లలకు టీకా అందుబాటులోకి వస్తుందని భావించారు.
నిజానికి.. ఇప్పటికే ఆ వయసు వారికి టీకా ఉండాలని వైద్యులు కోరుకుంటున్నారు. అయితే..ఈ టీకాను సిద్దం చేయటంలో ప్రఖ్యాత ఫార్మా దిగ్గజం ఫౌజర్ వెనకడుగు వేసింది. మొదట్లో ఈ వయసు వారికి టీకా వస్తుందని భావించినా.. రెండు డోసుల టీకా అనుకున్నంతగా రక్షణ ఇవ్వకపోవటంతో.. ఆ సంస్థ సదరు టీకా విషయంలో వెనకడుగు వేసినట్లుగా చెబుతున్నారు.
ఏమైనా.. ఒమిక్రాన్ ను అంత తేలిగ్గా లెక్కలోకి తీసుకుంటే ఏం జరుగుతుందన్న విషయం అమెరికా అనుభవాన్ని చూసినప్పుడు అర్థమవుతుంది. థర్డ్ వేవ్ దేశంలో అంతకంతకూ పెరుగుతున్న వేళ.. అమెరికాలో ఎదురవుతున్న పరిణామాల్ని భారత్ నిశితంగా గమనిస్తూ.. అందుకు తగ్గట్లు సిద్ధం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.