పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమాల్లో అమితాసక్తిని రేకెత్తిస్తున్నది ‘ఓజీ’. రన్ రాజా రన్, సాహో చిత్రాల తర్వాత సుజీత్ డైరెక్ట్ చేస్తున్న చిత్రమిది. అతను పవన్ కళ్యాణ్‌కు పెద్ద ఫ్యాన్ అని అందరికీ తెలుసు. సాహో అంచనాల భారాన్ని మోయలేక ఫ్లాప్ అయింది కానీ.. అందులో సుజీత్ దర్శకత్వ ప్రతిభ బాగానే కనిపించింది.
ఇప్పుడు మంచి కసి మీద ఉన్న సుజీత్.. తన ఫేవరెట్ హీరోకు కచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ ఇస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కొన్ని నెలల కిందటే మొదలైంది. పవన్ సినిమాల్లో లేటుగా మొదలైంది ఇదే అయినా.. చకచకా షూటింగ్ జరుపుకుంటూ ముందుకు సాగుతోంది.
పవన్ ఇచ్చిన డేట్లతో ఆయన మీద చకచకా కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించిన టీం.. తర్వాత ఆయన లేకుండా వేరే నటీనటులపై సీన్లు తీసింది. తాజాగా ఈ సినిమా మూడో షెడ్యూల్ పూర్తయినట్లు అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు.
ఇప్పటికే ‘ఓజీ’ షూట్ 50 శాతం పూర్తయినట్లు చిత్ర బృందం అధికారికంగానే ప్రకటించింది. పవన్ జులై-ఆగస్టు మధ్య ఒక రెండు వారాలు డేట్లు ఇస్తే కొత్త షెడ్యూల్ ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారు. రాజకీయాల్లో బిజీ అయ్యే ప్రయత్నంలో ఉన్న పవన్.. ఇక సినిమాలు పక్కన పెట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్లు ఈ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఐతే ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘హరిహర వీరమల్లు’ టీంలకు మాత్రం పవన్ అందుబాటులోకి రానని స్పష్టంగా చెప్పేసినట్లు తెలుస్తోంది.
కానీ ‘ఓజీ’ కోసం మరీ ఎక్కువ రోజులు పని చేయాల్సిన అవసరం లేకపోవడంతో కుదిరితే దాన్ని పూర్తి చేద్దామనే ఆలోచనలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన వీలు చేసుకుని డేట్లు ఇస్తే ఆయన మీద తీయాల్సిన సీన్లన్నీ తీసేసి.. మిగతా టాకీ పార్ట్ అంతా వీలైనంత త్వరగా పూర్తి చేసి.. డిసెంబరులో సినిమాను రిలీజ్ చేయాలనే ప్రణాళికలో ‘ఓజీ’ టీం ఉంది.