ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు తొలి రోజే(శనివారం) చిక్కులు ఎదురయ్యాయి. ఆయన వినియోగించాలని బావించిన `వారాహి` వాహనాన్ని అధికారులు అనుమతించలేదు. “మీకు అనుమతి లేదు. వారాహి వాహనాన్ని వినియోగించొద్దు. సాధారణ డీసీఎం వాహనంపై ప్రయాణించండి. దానిపైనే ఉండి ప్రచారం చేసుకోండి“ అని అధికారులు ఆయనకు తేల్చి చెప్పారు. దీంతో పిఠాపురంలో చేయాల్సిన పవన్ పర్యటనకు ఆదిలో హంసపాదు ఎదురైంది. ఈ పరిణామాలతో జనసేన కార్యకర్తలు హర్టయ్యారు.
ఏం జరిగింది?
అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్న మిత్రపక్షాల(బీజేపీ-జనసేన-టీడీపీ) అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడానికి పవన్ రెడీ అయ్యారు. ఈ క్రమంలో ఆయన చాన్నాళ్ల తర్వాత.. ఆయన వారాహి వాహనాన్ని బయటకు తీయించారు. దీనిపైనే ఆయన నిలబడి ప్రచారం చేయాలని.. ప్రసంగించాలని ప్రణాళిక కూడా వేసుకున్నారు. తొలుత పిఠాపురంలో స్థానిక అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించి.. అక్కడ నుంచి వారాహి వాహనంపైనే రోడ్ షో చేయాలని.. భావించారు. ఇక, ఆ తర్వాతీ.. కాకినాడలో బహిరంగ సభ నిర్వహించాలని అనుకున్నారు.
దీనికిగాను పవన్ వారాహి వాహనంలో వెళ్లాలనుకున్నారు. అయితే.. ఈ వాహనానికి అనుమతి లేదంటూ అధికారులు నిలిపివేశారు. ఎన్నికల సంఘం ఆదేశాలు ఉన్నాయని.. ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సి ఉందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారులు తేల్చి చెప్పారు. ఇదేసమయంలో అనుమతి ఇవ్వాలని కోరినా.. ఈసీ యాప్‌లో దరఖాస్తు చేసుకోవాలని.. తర్వాత 48 గంటలకు అనుమతి ఇస్తామని తేల్చి చెప్పారు. దీంతో వారాహి వినియోగానికి పర్మిషన్ ఇవ్వలేదు. తాము అప్పటికప్పుడు వారాహికి అనుమతులు ఇవ్వలేమని, చిన్నపాటి డీసీఎంకి మాత్రమే అనుమతి ఇస్తామని అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్.. వారాహిని పక్కన పెట్టేశారు. తాను బస చేసిన హోటల్ నుంచి బహిరంగ సభ వేదిక వద్దకు నేరుగా చిన్న వ్యానులో వెళ్లిపోయారు. నిజానికి.. వారాహిలో వెళ్తే, పురోహుతిక అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించా లని పవన్ భావించారు. కానీ.. వారాహికి అనుమతి ఇవ్వకపోవడంతో, పూజలు రద్దు చేసుకొని, సభకు నేరుగా వెళ్లారు. అయితే.. దీనివల్ల ముందుగా ప్లాన్ చేసుకున్న రోడ్ షో సహా ప్రజలను కలవాలన్న కార్యక్రమాలను పవన్ రద్దు చేసుకున్నారు.