తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రొటోకాల్ రచ్చ నడుస్తోది. తమ నియోజకవర్గాల్లో కనీస గౌరవం ఇవ్వడం లేదని… చట్టసభ సభ్యులుగా తమను గుర్తించడం లేదని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓవైపు గోలగోల చేస్తుంటే… దీనికి భిన్నంగా ఇద్దరు బీజేపీ ఎంపీలు మాత్రం రివర్స్ గేర్‌లో వెళ్తూ అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో అధికారిక కార్యక్రమాలకు తప్పకుండా పిలవాల్సిందేనంటూ అధికారులను హెచ్చరిస్తున్నారు. కాదని నిర్లక్ష్యం చేస్తే ఎంతదూరమైనా వెళతామంటూ బెదిరిస్తున్నారు.
ఈ ఎంపీల దూకుడు తట్టుకోలేక అధికారులు కూడా మనకెందుకు వచ్చిన సమస్య అనుకుంటూ రాజీకి వస్తున్నారట. అధికారులను ఇంతగా బెంబేలెత్తిస్తున్న ఆ ఎంపీల్లో ఒకరు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అయితే, మరొకరు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. స్వతహాగానే ఫైర్ బ్రాండ్ లీడర్లుగా ముద్ర పడిన ఈ ఇద్దరు నేతలు.. ఎంపీలుగా గెలవడం, అది కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తరఫున ఎన్నికవడంతో మరింతగా విజృంభిస్తున్నారు. దీంతో వీరద్దరి వ్యవహారమే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది.
అధికారులకు మహిళా ఎంపీ మాస్ వార్నింగ్ లు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయితే మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగా ఎన్నికైన డీకే అరుణ నెలరోజుల్లోనే అధికారులకు మాస్ వార్నింగ్లిస్తూ తన ప్రతాపం చూపుతున్నారు. ప్రతిపక్ష ఎంపీ అయినా, నియోజకవర్గంలో తనకు ఆహ్వానం లేకుండా ఏ కార్యక్రమం చేయకూడదని హుకుం జారీ చేస్తూ అధికారులను హడలెత్తిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ, పరిపాలనా అనుభవం ఉన్న అరుణ స్పీడ్‌ను అధికారులు తట్టుకోలేకపోతున్నారు.
వాస్తవానికి మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు ఏడుగురూ కాంగ్రెస్ వారే ఉన్నారు. బీఆర్ఎస్, బీజేపీలకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. దీంతో గత ఏడు నెలలుగా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రొటోకాల్ వివాదాలు ఏవీ లేవు. కానీ, లోక్‌సభ సభ్యురాలిగా అరుణ గెలిచిన తర్వాత రగడ మొదలైంది. ఇటీవల జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనకు వచ్చారు. కానీ, ఎంపీగా అరుణకు ఆహ్వానం పంపలేదు అధికారులు. దీనిపై కన్నెర్ర జేసిన ఎంపీ…. ప్రొటోకాల్ పాటించని అధికారులపై యాక్షన్ తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారట. దీంతో తప్పు తెలుసుకున్న జిల్లా అధికారులు పొరపాటయిందని అంగీకరించడంతో అరుణ శాంతించారు.
అధికారులకు చుక్కలు చూపిస్తున్న రఘునందన్..
మెదక్‌లోనూ ఎంపీ రఘునందన్‌రావు అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. సాధారణంగానే రఘునందన్ మాటల మాంత్రికుడు. తన వాగ్ధాటితో ఎదుట వ్యక్తులను ఆత్మరక్షణలోకి నెట్టేసే రఘునందన్ ప్రొటోకాల్ పాటించని అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నట్లు చెబుతున్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక్క మెదక్‌లో మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు. మిగిలిన ఆరు చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి చేరికతో కాంగ్రెస్ బలం రెండుకు పెరిగింది.
నియోజకవర్గంలో ఎక్కువగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండటం వల్ల ఇక్కడ తరచూ ప్రొటోకాల్ వివాదాలు తలెత్తుతున్నాయి. గెలిచిన ఎమ్మెల్యేలకు బదులుగా ఓడిన కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవుతుండటం, వేదికపై వారే పెత్తనం చలాయిస్తుండటంతో నిత్యం ఏదో రగడ జరుగుతూనే ఉంది. ఈ అంశంపై ఇప్పటికే మెదక్ ఎమ్మెల్యేలు స్పీకర్ ను, సీఎంను కలిసి కూడా తమ గోడు వెళ్లబోసుకున్నారు.అయితే రఘునందన్‌రావు ఎంపీగా గెలవడంతో ఈ వివాదం మరింత ముదిరింది.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో.. దుబ్బాక ఎమ్మెల్యేగా ప్రొటోకాల్ విషయంలోనే పోరాటం చేసిన రఘునందన్‌రావు… అప్పటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మొదటి నుంచే కార్నర్ చేయడం మొదలుపెట్టారు. ఎంపీగా ప్రోటోకాల్ పాటిస్తూ నియోజకవర్గంలో జరిగే ప్రతి కార్యక్రమానికి తనను పిలవాల్సిందేనంటూ ముందుగానే అధికారులకు తేల్చి చెప్పారట.
జాతీయస్థాయిలో రచ్చ చేస్తామని వార్నింగ్ లు..
ఇంతకుముందు దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రొటోకాల్ ఫైట్ చేసిన రఘునందన్‌రావు.. ఇప్పుడు ఏడు నియోజకవర్గాల అధికారులతో ఒకేసారి యుద్ధం చేయాల్సిరావడంతో గేర్ మార్చారని చెబుతున్నారు. ప్రొటోకాల్ కోసం ఎవరినీ బతిమిలాడి ప్రయోజనం లేదని భావించిన రఘునందన్… తనదైన స్టైల్లో దూకుడు చూపుతూ రూల్స్ పేరిట అధికారులను ముప్పతిప్పలు పెడుతున్నారట… దీంతో ఆయనతో పంచాయతీ ఎందుకుని భావిస్తున్న అధికారులు… ప్రతి కార్యక్రమానికి ఆహ్వానం పంపుతున్నారట.
అయితే ఎమ్మెల్యేలకు మాత్రం అధికారుల తీరు మింగుడుపడటం లేదట. కేంద్రంలో అధికారంలో ఉండటం కూడా రఘునందన్, డీకే అరుణకు ఈ విషయంలో కలిసొస్తుందంటున్నారు. కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉండటం వల్ల… తమను నిర్లక్ష్యం చేస్తే.. జాతీయస్థాయిలో రచ్చ చేస్తామనే వార్నింగులిస్తూ అందరినీ దారిలోకి తెచ్చుకుంటున్నట్లు చెబుతున్నారు.