ట్రాఫిక్ చలానాలపై భారీ రాయితీతో క్లియర్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర పోలీసులు.. తాజాగా ఆ ఆఫర్ ను మరికొంతకాలం పొడిగిస్తున్నట్లుగా పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం.. కరోనాతో కిందా మీదా పడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు వీలుగా చలానాలపై భారీ రాయితీలను ప్రకటించటం.. ఆ సమయంలో భారీ ఎత్తున చలానాలు క్లియర్ కావటంతో పాటు అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి రూ.300 కోట్లకు పైనే ఆదాయం రావటం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. కొత్తగా కొలువు తీరిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం సైతం ట్రాఫిక్ చలానాలపై రాయితీ సౌకర్యాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ముందుగా ప్రకటించిన దాని ప్రకారం గురువారంతో ముగిసింది. అయితే.. ప్రజల నుంచి వస్తున్న స్పందన నేపథ్యంలో మరికొన్ని రోజులు ఈ ఆఫర్ ను పొడిగిస్తే బాగుంటుందన్న వినతులు పెద్ద ఎత్తున వస్తున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.
ఈ కారణంతో.. జనవరి 31 వరకు గడువు తేదీ విధిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో.. వరుస సెలవులు రావటం లాంటి కారణాలతో కొందరు చలానాల్ని క్లియర్ చేసే అవకాశం ఉంటుందని.. అందుకే.. మరికొన్ని రోజులు ఈ రాయితీని పొడిగించటం ద్వారా.. పెండింగ్ చలానాల్ని క్లియర్ చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా చెబుతున్నారు. గురువారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1.29 కోట్ల పెండింగ్ చలానాలు క్లియర్ కావటంతో పాటు వాటి ద్వారా ప్రభుత్వానికి రూ.113 కోట్ల ఆదాయం వచ్చినట్లుగా పేర్కొన్నారు. సో.. పెండింగ్ చలానాలు ఉన్న వారంతా ఈ ఆఫర్ ను వినియోగించుకోవటం మంచిది.