దేశంలో కరోనా సెకండ్ వేవ్ కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న మహమ్మారి వైరస్..ఇపుడు పొరుగు రాష్ట్రాలనూ గడగడలాడిస్తోంది. అయితే, దేశంలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ…మరోసారి లాక్ డౌన్ విధించే ఆలోచన లేదని ప్రధాని నరేంద్ర మోడీ క్లారిటీ ఇచ్చారు.
అయినప్పటికీ, గత లాక్ డౌన్ అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న వలస కార్మికులు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే, వలస కార్మికులు తమతోపాటు కరోనాను మోసుకువచ్చే అవకాశముందని ఆయా రాష్ట్రాలు భయపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఒడిశాలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
పొరుగు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌తో సరిహద్దును మూసివేయాలని ఒడిశా సర్కార్ నిర్ణయించింది. అంతర్రాష్ట్ర సరిహద్దులో పెట్రోలింగ్‌ను ఒడిశా సర్కార్ ముమ్మరం చేసింది. ఛత్తీస్‌గఢ్ సరిహద్దు జిల్లాల్లో గత కొద్ది రోజులుగా కొవిడ్ కేసులు భారీగా పెరగడంతో పాటు వలస కార్మికులు అధిక సంఖ్యలో రావడం నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
పొరుగు ప్రాంతాల ప్రజలు ఒడిశా రాష్ట్రంలోకి వస్తే కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా చూపాలని ఆదేశించింది. అధికంగా కొవిడ్ కేసులున్న రాష్ట్రాల నుంచి వలస కార్మికులు ఒడిశాకు తిరిగి వస్తున్నారని, దీంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఒడిశా కార్మిక మంత్రి సుశాంత్ సింగ్ తెలిపారు. ఒడిశా సరిహద్దు పాయింట్ల వద్ద తాత్కాలిక వైద్య శిబిరాలు సిద్ధంగా ఉంచామన్నారు.