మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో సంపత్ నంది దర్శకత్వ పర్యవేక్షణలో అశోక్ తేజ తెరకెక్కించిన `ఓదెల 2` చిత్రం నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. నేడు మహాకుంభమేళాలో 102 ఏళ్ల నాగ సాదు చేతులు మీదగా మేకర్స్ టీజర్ ను లాంచ్ చేశారు. టీజర్ ప్రకారం.. ఓదెల గ్రామాన్ని ఓ దుష్ట శక్తి నుంచి తమన్నా ఎలా రక్షిస్తుంది అనే కథాంశంతో సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది.
టీజర్ ఆరంభం నుంచి ముగింపు వరకు సూపర్ థ్రిల్లింగ్ గా కొనసాగింది. ఓవైపు హారర్ ఎలిమెంట్స్.. మరోవైపు ఆధ్యాత్మిక అంశాలు సినిమాపై ఆసక్తి రెకెత్తించాయి. 2022 లో విడుదలైన హిట్ మూవీ ` ఓదెల రైల్వే స్టేషన్` కు సీక్వెల్ గా ఓదెల 2 వస్తోంది. అయితే ఫస్ట్ పార్ట్ లో చనిపోయిన వశిష్ట ఎన్ సింహా దెయ్యంగా మారి వచ్చినట్లు టీజర్ లో చూపించారు. అతని బారి నుంచి ఊరిని కాపాడే నాగ సాధువుగా తమన్నా కనిపించింది. యాక్షన్ సీక్వెన్స్, భారీ విజువల్స్, తమన్నా లుక్స్, అజనీష్ లోక్నాథ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలెట్ గా నిలిచాయి.
ఉత్కంఠ రేకెత్తించే సన్నివేశాలతో సాలిడ్ గా ఉన్న టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై అంచనాలను తారా స్థాయిలో పెంచేసింది.కాగా, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్వర్క్స్ బ్యానర్ పై ఓదెల 2 చిత్రాన్ని సంపత్ నంది, మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ లో హెబ్బా పటేల్, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతోంది.