ఎన్టీఆర్ ….ఈ పేరు వినగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ, దివంగత మహానేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి రామారావు ఖ్యాతి దశదిశలా వ్యాపించింది. అన్నగారు అని ఆప్యాయంగా తెలుగువారంతా పిలుచుకునే ఎన్టీవోరు ఎంతోమందికి దైవ సమానుడు. అందుకే ఆయన యుగపురుషుడు అంటూ అభిమానులు కొనియాడుతుంటారు.
ఈ ఏడాది మే 28తో అన్నగారు జన్మించి 100 సంవత్సరాలు పూర్తయ్యాయి. అందుకే, గత ఏడాది కాలంగా అన్నగారి శత జయంతి వేడుకలను ప్రపంచవ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు, నందమూరి, నారా అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ‘‘శక పురుషుని శత జయంతి వేడుకలు’’ పేరుతో టీడీపీ ఈ వేడుకలను గత ఏడాది ఏప్రిల్ 28న మొదలుబెట్టింది. ఈ క్రమంలోనే తాజాగా అమెరికాలోని లాస్ ఏంజిలెస్ లో అన్నగారి శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. దాదాపు 1500 మంది ఎన్నారైలు, టీడీపీ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.
ఈ కార్యక్రమానికి టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులతో పాటు ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, ప్రముఖ సినీ దర్శకుడు వైవీఎస్ చౌదరి, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ తదితరులు హాజరయ్యారు. తెలుగువారి ఆరాధ్య దైవం…అందాల రాముడు అన్నగారి శత జయంతి వేడుకలకు పంచెకట్టులో వచ్చిన ఏబీవీ…అన్నగారి గురించి కీలక ప్రసంగం చేశారు. లాస్ ఏంజిలెస్ లోని తెలుగు వారంతా సకుటుంబ సపరివార సమేతంగా హాజరై ఈ రాజకీయేతర కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. యువతీయువకుల ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో నభూతో న భవిష్యత్ అన్నరీతిలో ఈ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. ఎన్టీఆర్ అభిమానులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో అన్నగారిని గుర్తుకు తెచ్చుకుంటూ పలువురు వ్యాఖ్యానించారు. అన్నగారి వీడియోలు, పాటలు, డైలాగులు, స్పీచ్ లతో పాటు సంగీత విభావరి కూడా నిర్వహించి ఆయనకు ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ప్రవాసాంధ్రులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు, NTR డాన్సులు, ఏకపాత్రాభినయాలు ప్రదర్శించడంతోపాటు వారే ఎన్టీఆర్ మీద కవితలు రచించి వాటిని ఆహుతులను అబ్బురపరిచారు. ఈ శతజయంతి ఉత్సవాలకు సినిమా రంగం నుంచి ప్రముఖ దర్శకులు వైవిఎస్ చౌదరి, నటులు నాగినీడు హాజరుకాగా రాజకీయ రంగం నుంచి టి డి జనార్ధన్, పరిటాల శ్రీరామ్, పులివర్తి నాని, గాలి భానుప్రకాష్ హాజరయ్యారు. అలానే ఐపీఎస్ ఆఫీసర్ మరియు మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ ఏ బి వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమానికి హాజరవటం ఒక కోసమెరుపు.
అలానే ఈ శతజయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన క్రికెట్, వాలీబాల్ మరియు టెన్నికాయిట్ క్రీడా విజేతలకు ఎన్టీఆర్ ట్రోఫీలను బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమ నిర్వాహకులు ప్రసాద్ పాపుదేశి , చందు నంగినేని, రాహుల్ వాసిరెడ్డి , వెంకట్ ఆళ్ల మాట్లాడుతూ తెలుగు జాతికి ప్రపంచ ఖ్యాతి తెచ్చిన నందమూరి తారకరామారావుగారి శతజయంతి ఉత్సవాలను జరపటం తమ బాధ్యత అని దీనికి సహకరించిన అన్ని తెలుగు సంఘాల వారికి, మరియు మార్గదర్శకం చేసిన శరత్ కామినేనికి కృతజ్ఞతలు తెలిపారు.