స్వయానా మేనత్త- మామ కుటుంబం. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తి. నిండు సభలో తీవ్ర అగౌరవానికి గురయ్యారు. ఎన్నడూ రాజకీయం అన్నమాట కూడా ఎరుగని.. ఆయన సతీమణిని కూడా ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా అవమానించారు. అయితే.. ఈ విషయంలో సొంత కుటుంబం నుంచి వచ్చిన స్పందనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే.. చంద్రబాబు ఫ్యామిలీ.. నందమూరి వంశం.
అన్నగారు ఎన్టీఆర్ కుమార్తె, చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని టార్గెట్ చేస్తూ.. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు నిండు సభలో అత్యంత దారుణంగా వ్యాఖ్యానించారు. దీనిని సభ్య సమాజం.. కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా స్పందించి.. ఖండించింది. వైసీపీ ఎమ్మెల్యేల తీరును తీవ్రంగా దుయ్యబట్టారు అన్ని వర్గాల ప్రజలు.
ఇక, ఈ క్రమంలోనే మా ఆడపడుచును అంటారా? అవమానిస్తారా? అంటూ.. నందమూరి కుటుంబం ఎన్నడూ లేని విధంగా.. ఏకతాటిపైకి వచ్చి స్పందించింది. వైసీపీ నేతలకు వార్నింగులు ఇచ్చారు. అదేసమయంలో జగన్ స్పందన కోసం ఎదరు చూస్తున్నామని తేల్చి చెప్పారు.
బాలకృష్ణ నుంచి చైతన్య కృష్ణ వరకు, పురందేశ్వరి(వాస్తవానికి బీజేపీ నాయకురాలు) నుంచి ఉమామహేశ్వరి వరకు అందరూ.. మీడియా ముందుకు వచ్చి.. స్పందించారు. తీవ్రస్థాయిలో వైసీపీని దుయ్యబట్టారు. అన్నగారి కుటుంబం అంటే..ఏమనుకుంటున్నారు? అంటూ.. నిప్పులు చెరిగారు. ఖబడ్దార్.. అంటూ.. వైసీపీ సర్కారు, నేతలపై.. విరుచుకుపడ్డారు.
కట్ చేస్తే.. ఈ కుటుంబంలోని కీలక వ్యక్తి, అన్నగారు ఎన్టీఆర్ పేరును పుణికి పుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ కూడా తాజాగా శుక్రవారం అసెంబ్లీ ఘటనపై స్పందించారు. అయితే.. నందమూరి కుటుంబంతో కలిసి కాకుండా.. ఆయన విడిగా ఒక పోస్టును మీడియాకు విడుదల చేశారు.
నిజానికి నందమూరి కుటుంబంతో కలిసే ఆయన స్పందిస్తారని అందరూ అనుకున్నారు. అసలు ఇప్పుడు ఏపీలో జూనియర్ క్రేజ్ ఎక్కువగా ఉంది. ఈ సమయంలో ఆయన రియాక్షన్ కోసం అందరూ ఎదరు చూశారు. అయితే.. చాలా ఆలస్యంగా స్పందించిన జూనియర్.. ఆచితూచి వ్యాఖ్యలు చేశారు. తాను ఒక తండ్రిగా, కొడుకుగా, భర్తగా, పౌరుడిగా స్పందిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిణామాలు తగవని.. ఇకనుంచి జాగ్రత్తగా ఉండాలని.. జూనియర్ చెప్పుకొచ్చారు.
వాస్తవానికి ఏదైని ఇలాంటి భావోద్వే గ ఘటనలు చోటు చేసుకున్నప్పుడు.. జూనియర్ వంటివారు తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతారని అందరూ అనుకున్నారు. కానీ, ఆయన సొంత మావయ్య కన్నీరు పెట్టుకుని బోరున విలపిస్తే.. సొంత అత్తను నిండు సభలో అగౌరవ పరిస్తే.. చాలా లైట్ వెయిట్లో రియాక్ట్ అయ్యారనే కామెంట్లు వినిపిస్తుండడం గమనార్హం.
నిజానికి పార్టీలకు అతీతంగా శుక్రవారం అసెంబ్లీపై అన్ని వర్గాలు స్పందించాయి. తెలంగాణలోనే చూసుకుంటే.. కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డి, సీతక్క, రేణుకా చౌదరి, ఆరికపూడి గాంధీ ఇలా ఎందరో తీవ్రస్థాయిలో జగన్పై విమర్శలు చేశారు.
ఈ రోజు మీరున్నారు.. రేపు చంద్రబాబు అధికారంలో ఉండొచ్చు.. అప్పుడు మీ పరిస్థితి ఏంటని? నిలదీశారు. నిజంగానే ఏపీలో ఉన్నది కౌరవ సభేనేమో..! అంటూ.. రేణుకా చౌదరి తన సహజసిద్ద ధోరణిలో వ్యాఖ్యలు చేశారు. మరి ఈ మాత్రం కూడా జూనియర్ చేయకపోవడం ఏంటి? అనేది ప్రశ్న. ఏదో పైపై మాటలు.. మొక్కుబడి.. మాటలు అనేలా ఉన్నాయని అంటున్నారు నెటిజన్లు.
ఇదే విసయంపై రాజకీయ నేతలు కూడా పెదవి విరుస్తున్నారు. యువ నాయకుడు.. ఫ్యూచర్ ఉన్న వ్యక్తి ఇప్పుడు.. మహిళల విషయంలో జరిగిన ఈ అంశంపై సీరియస్గా రియాక్ట్ అయి ఉంటే అదొక సంచలనం అయ్యేదని అంటున్నారు. మొత్తానికి జూనియర్పై అసంతృప్తి వ్యక్తం అవుతుండడం గమనార్హం.