తనను అభిమానించి.. ఆరాధించే వారికి క్షమాపణలు చెప్పారు తారక్ అలియాస్ జూనియర్ ఎన్టీఆర్. తన కారణంగా వారికి ఎదురైన అసౌకర్యానికి ఆయన స్పందించారు. ఎవరు ఏమీ అడకుండానే తనకు తానుగా సారీ చెప్పిన ఆయన.. తాజా పరిణామాల నేపథ్యంలో ఆచితూచి అన్నట్లుగా రియాక్టు అయ్యారు.
బాలీవుడ్ భారీగా ఆశలు పెట్టుకున్న ‘బ్రహ్మాస్త్రం’ మూవీ వచ్చే వారం విడుదల కానున్న విషయం తెలిసిందే. కరోనా తర్వాత తన వైభవాన్ని పూర్తిగా కోల్పోయిన బాలీవుడ్.. తన ఉనికిని చాటేందుకు ఉన్న ఏకైక భారీ బడ్జెట్ మూవీగా దీన్ని చెబుతున్నారు. ఈ మూవీ విజయం ఇప్పుడు బాలీవుడ్ కు అత్యవసరం.
రణ్ బీర్ కపూర్.. అలియా భట్.. నాగార్జున.. అమితాబ్ బచ్చన్.. అయాన్ ముఖర్జీ.. మౌనీరాయ్ తదితరులు నటించిన ఈ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ ను రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. చివరి క్షణాల్లో పోలీసులు ఇచ్చిన షాక్ తో.. వేదికను మార్చి.. ప్రీరిలీజ్ ఫంక్షన్ కాస్తా.. ప్రెస్ మీట్ గా మార్చేశారు. దీంతో.. ఈ ఈవెంట్ కు ప్రధాన ఆకర్షణగా మారిన జూనియర్ ఎన్టీఆర్ ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు వచ్చే ప్రయత్నం చేయటం.. వారి ఆశల మీద నీళ్లు చల్లే పరిస్థితులు చోటు చేసుకోవటంతో తారక్ రియాక్టు అయ్యారు.
‘ఈవెంట్ వేదికకు వచ్చిన.. రావాలనుకున్న నా అభిమానులకు ముందుగా నన్ను మన్నించండి. మీరు వేడుకకు రాకున్నా మంచి చిత్రాలను.. నన్ను ఆదరిస్తారనే నమ్మకం ఉంది. మీడియాను క్షమించాలని కోరుతున్నా. వినాయక నిమజ్జనాల నేపథ్యంలో అధిక బందోబస్తు ఏర్పాటు చేయలేమని పోలీసు శాఖ చెప్పింది. పోలీసులు ఉండేది మన భద్రత కోసం. వారు చెప్పింది వినటం మన ధర్మం. అందుకే వారికి సహకరించి మేం ఇలా చిన్న వేదిక నుంచి మీతో మాట్లాడుతున్నాం’ అని వ్యాఖ్యానించారు.
తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘తాను చాలామంది నటులను ఇష్టపడతానని.. ఒక నటుడిగా అమితాబ్ బచ్చన్ ప్రభావం తనపై చాలా ఎక్కువగా ఉందన్నారు. ఆయనకు తాను వీరాభిమానిని అని చెప్పారు. బిగ్ బి తర్వాత తాను అంతగా ఇష్టపడేది రణబీర్ నేనని.. అతనితో కలిసి ఈ వేదికను పంచుకోవటం చాలా హ్యాపీగా ఉంది’’ అని పేర్కొన్నారు. ఈ మూవీకి పని చేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆల్ ద బెస్టు చెప్పారు.
తెలుగు నటుడు హిందీ మూవీలో నటించి.. హిందీలో మాట్లాడితే ఎలా ఉంటుందనే దానికి నాగార్జున బాబాయ్ ఖుదాగవా చూసి తెలుసుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తాను ఎవరినీ తక్కువ చేసి మాట్లాడటం లేదని.. ప్రేక్షకులకు మంచి కథలను అందించేందుకు ప్రయత్నిద్దామని తారక్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ మాటల్లో వినమ్రత కొట్టొచ్చినట్లుగా కనిపించటమే కాదు.. ఆచితూచి మాట్లాడిన వైనం అందరిని ఆకట్టుకునేలా మారింది.