మే 28వ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. అయితే.. ఇది రావడానికి మరో నెల రోజులు సమయం ఉంది. అయితే.. ఆ రోజుకు అన్నగారు ఎన్టీఆర్కు 100 సంవత్సరాలు పూర్తవుతాయి. ఆయన జీవించి ఉంటే.. వందవ పుట్టిన రోజును చేసుకునేవారు. అయితే.. పార్టీ తరఫున ఆయనకు ఘనంగా పుట్టిన రోజు చేసేందుకు టీడీపీ సకల ఏర్పాట్లు చేసింది.ఇప్పటికే గత ఏడాది మే 28 నుంచి శత వసంతాల పండుగను అంబరమంటేలా ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా ఏప్రిల్ 28న విజయవాడకు శివారులో ఉన్న పెనమలూరు నియోజకవర్గంలోని తాడిగడపలో భారీ సభను ఏర్పాటు చేశారు. శత జయంతి ఉత్సవాల అంకురార్పణకు సూపర్ స్టార్ రజినీకాంత్ విశిష్ట అతిథిగా, తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాల పుస్తకాలను నేడు ఆవిష్కరించనున్నారు.
ఎన్టీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలు, ప్రజల్ని చైతన్య పరుస్తూ వివిధ వేదికల మీద చేసిన ప్రసంగాల తో కూడిన 2 పుస్తకాలను విడుదల చేయనున్నారు. తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో దేశ సరిహద్దుల వరకు తెలుగు కీర్తిని ఇనుమడింపజేసిన ఎన్టీఆర్ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందిం చాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ రాజకీయ కార్యదర్శి టీడీ జనార్దన్ నేతృత్వంతో సావనీర్ కమిటీ ఏర్పడింది.
గత ఎనిమిది నెలలుగా అవిశ్రాంతిగా కృషి చేసి ఎన్టీఆర్ జీవితాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించేలా ఓ వెబ్సైట్, యాప్ రూపకల్పన చేశారు. చైతన్య రథంపై ఆ నాడు పార్టీ కోసం ఎన్టీఆర్ చేసిన ప్రసంగాలను గుదిగుచ్చి..అందించే ప్రయత్నం చేశారు. అలాంటి ప్రసంగాలను ముందు తరాలకు అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఎన్టీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాల సంకలనంతో ఓ పుస్తకం, బయట చేసిన ప్రసంగాల సంకలనంతో మరో పుస్తకాన్ని వెలువరించనున్నారు.