ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ ల విషయంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పెన్షన్ల పెంపు ఫైల్‌పై చంద్రబాబు సంతకం చేయడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్ ప్రసాద్ తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. వైఎస్ఆర్ పెన్షన్ పేరుతో ఉన్న పథకాన్ని గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టిన ‘ఎన్టీఆర్ భరోసా’ పేరుతో కొనసాగనుంది.
వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇప్పుడు అందుతున్న 3వేల పెన్షన్‌ను ప్రభుత్వం రూ. 4 వేలకు పెంచింది. ఈ పెన్షన్ పెంపు మొత్తం ఏప్రిల్ నెల నుంచే అమలు కానుంది. అంటే జూలై 1న ఇచ్చే పెన్షన్‌లో గడిచిన మూడు నెలల పెంపు డబ్బులు కూడా కలిపి వృద్ధులు, వితంతువులకు రూ. 7 వేలు ఇచ్చేలా జీవో జారీ చేసింది చంద్రబాబు ప్రభుత్వం.
ఇక దివ్యాంగుల పెన్షన్ డబుల్ చేస్తూ 6 వేలకు, పూర్తిస్థాయిలో అస్వస్థతకు గురైనవారికి, తీవ్ర అనారోగ్యంతో మంచాన పడినవారికి, వీల్‌ఛైర్‌లో ఉన్నవారికి అందే రూ. 5 వేల పెన్షన్‌ను రూ. 15 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారికి, డయాలసిస్ స్టేజ్‌కు ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తుల పెన్షన్‌ను రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు మొదటిగా ఐదు ఫైల్స్‌పై సంతకాలు చేశారు. అందులో ఒకటి పెన్షన్ల పెంపు. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే 200 రూపాయలున్న వృద్ధుల పెన్షన్ ఐదు రేట్లు పెంచి వెయ్యి చేశారు. ఆ తర్వాత దాన్ని 2వేలకు పెంచారు. ఈ సారి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం రూ.4 వేలకు పెంచారు. అయితే ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అప్పుడే తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్నది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఫించన్లు పెంచి ఇవ్వాలన్న డిమాండ్ మొదలయింది.