ఖండాంతరానికి చేరిన తెలుగువాడు అమరావతికి అండాదండా నేనంటూ నిలిచాడు.. జన్మభూమి రుణం తీర్చగ పిడికిలి ఎత్తి.. కదంతొక్కి నినదించాడు.. ఆంధ్రప్రదేశ్లో వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటనతో అమరావతి రాజధాని రైతుల ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోన్న సంగతి తెలిసిందే. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులను వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో అణిచివేయాలని చూస్తున్న నేపథ్యంలో పలువురు ప్రవాసాంధ్రులు రైతులకు అండగా నిలుస్తున్నారు.
‘ఒక రాష్ట్రం-ఒక రాజధాని’ నినాదంతో ఉద్యమిస్తున్న రైతులకు తమ వంతు ఆర్థిక సాయం అందజేసేందుకు #NRIsFORAMARAVATI అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు అమెరికా లోని నార్త్ కరోలినా రాష్టం షార్లెట్ సిటీ ప్రవాసాంధ్రులు రూ.25లక్షలు విరాళమిచ్చారు. షార్లెట్ సిటీ ప్రవాసులు టాగోర్ మల్లినేని, నాగ పంచుమర్తి, నితిన్ కిలారు, శ్రీనివాస్ పాలడుగు, బాలాజి తాతినేని, శ్రీనివాస్ చందు గొర్రెపాటి ఆధ్వర్యంలో షార్లెట్ సిటీకి చెందిన 130 మంది ప్రవాసాంధ్రులు రేండు రోజుల వ్యవధిలో రూ.25లక్షలు($31,454) సేకరించి #NRIsFORAMARAVATI సంస్థకు అందచేశారు.