దేశంలో మరే మహానగరానికి లేని ఇమేజ్ హైదరాబాద్ సొంతమంటున్నారు. మినీ భారత్ గా మారుతున్న హైదరాబాద్ వైపు విదేశాల్లో స్థిరపబడిన భారతీయులు ఆసక్తిగా చూస్తున్నారా? ఇక్కడ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టటంతోపాటు.. ఇళ్లను కొనుగోలు చేయటం కోసం ఆసక్తి చూపుతున్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. దీనికి సంబంధించి తాజాగా ఒక సర్వే రిపోర్టు విడుదలైంది. ఇందులో పలు ఆసక్తికర అంశాల్ని పేర్కొన్నారు.
హైదరాబాద్ లో ఇళ్లు కొనేందుకు విదేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలు ఆసక్తి చూపటానికి ఉన్న కారణాలు ఏమిటన్న దానిపై పలు అంశాల్ని సీఐఐ అన్ రాక్ కన్స్యూమర్ సెంటిమెంట్ సర్వే హెచ్ 1, 2022 సర్వే రిపోర్టు బయటపెట్టింది. ఇందులో కీలకమైనది అమెరికా డాలర్ తో పోలిస్తే.. ఇండియారూపాయి విలువ తగ్గిపోవటంతో.. తమ పెట్టుబులకు మేలు జరుగుతుందన్న భావనలో ఎన్ఆర్ఐలు ఉన్నట్లు చెబుతున్నారు. దేశంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే.. హైదరాబాద్ మహానగరం శర వేగంగా దూసుకెళ్లిపోతున్న వైనం.. ఇక్కడి వాతావరణ పరిస్థితులు కూడా కారణంగా చెబుతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో వాయి కాలుష్యం తెగ ఇబ్బంది పెడుతుంటే.. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో మౌలిక సదుపాయాల లేమి ఉన్నందున.. మిగిలి ఉన్న ఆప్షన్ గా హైదరాబాద్ ఒక్కటే నిలుస్తుందని చెబుతున్నారు. అందుకే ఎన్ఆర్ఐలు ఇళ్లు కొనుగోలు చేసేందుకు హైదరాబాద్ కు తమ ఆప్షన్ గా మార్చుకుంటున్నారన్న విషయం సర్వే వెల్లడించింది.
విదేశాల్లో ఉన్న భారతీయుల్లో పలువురు ఈ సర్వేలో పాల్గొన్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 60 శాతం మంది హైదరాబాద్.. ఢిల్లీ.. బెంగళూరు లో ఇళ్లు కొనుగోలు చేస్తామని తమ అభిప్రాయంగా చెప్పినట్లు పేర్కొంది. ముంబయి నాలుగో స్థానంలో నిలిచింది.
హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. తాజాగా నెలకొన్న పరిణామాల నేపథ్యంలో చాలామంది ఎన్ ఆర్ ఐలు విదేశాల్ని వదిలి తిరిగి భారత్ కు వెళ్లాలన్న యోచనలో ఉన్నట్లుగా సర్వే చెప్పింది. ఇలాంటి వారిలో ఎక్కువ మంది రూ.90 లక్షలు మొదలుకొని రూ.1.5 కోట్ల మధ్య ప్రాపర్టీలను కొనుగోలు చేయటానికి ఆసక్తిని ప్రదర్శిస్తున్నట్లుగా చెబుతున్నారు.