భారత దేశపు 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకులను మన దేశంలోని ప్రజలతోపాటు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులంతా ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. భారత దేశానికి స్వాతంత్రం తేవడానికి ఎన్నో త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకుంటూ వారికి ఘన నివాళి అర్పించడం ఈ రోజు ఆనవాయితీ. వారిచ్చిన స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తున్నామన్న విషయాన్ని గుర్తు తెచ్చుకొని వారి సేవలను కొనియాడడం పరిపాటి. ఇక, ఇండిపెండెన్స్ డే నాడు….డిబేట్ కాంపిటీషన్లు, దేశ భక్తిని పెంపొందించే గీతాలు ఆలపించే కార్యక్రమాలు సహజం.
కానీ, అమెరికాలోని కొందరు ఎన్నారైలు స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఓ పార్టీలాగా నానా హంగామా చేసి సెలబ్రేట్ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు, పబ్ లో వీకెండ్ నాడు ఎంజాయ్ చేసినట్లుగా డీజే పెట్టి మరీ ఆ పాటలకు చిందులేయడంపై పలువురు మండిపడుతున్నారు. స్వాతంత్ర దినోత్సవం నాడు ఇలా చేయడం సిగ్గుచేటని, ఇలా చేయడం స్వాతంత్ర సమరయోధులను అవమానించడమే నని పలువురు భారతీయులు, ఎన్నారైలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా…వారిపై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న మౌంటైన్ హౌస్ స్పోర్ట్స్ అండ్ రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ చిందులు వేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్న ఆసక్తి ఉన్నవారు తమను సంప్రదించాలంటూ ఆ క్లబ్ నిర్వాహకులు ఆహ్వానం కూడా పంపారు. జెండా వందనం అనే మొక్కుబడి తంతు ముగిసన తర్వాత… బాలీవుడ్ గానా బజానా, మ్యూజికల్ నైట్, భారత్ లోని వివిధ ప్రాంతాల వారు స్టేజిపై చిందేయడం, ఫ్లాష్ మాబ్, ఫేస్ పెయింటింగ్ వంటి ఎన్నో బృహత్తర కార్యక్రమాలున్నాయంటూ ఆహ్వానం పంపారు. మౌంటైన్ హౌస్ లోని సెంట్రల్ పార్క్ లో జరిగిన ఈ కార్యక్రమంలో స్టేజి మీద భారత జెండాను కర్టన్ లాగా తగిలించి…దాని ముందు రౌడీ బేబీ….పాటకు ఎన్నారైలు స్టెప్పులు వేయడం ఎంతో అవమానకరమని విమర్శలు వస్తున్నాయి.