తెలంగాణకు పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. 2 వారాల అమెరికా టూర్ లో భాగంగా పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్ బృందం భేటీ అయింది. ఈ పర్యటనలో భాగంగా అమెరికాలోని ఇండో-అమెరికన్ కమ్యూనిటీతో, తెలుగు ఎన్నారైలతో కేటీఆర్ మమేకమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మన ఊరు మన బడి’ పథకంపై ఎన్నారైలతో కేటీఆర్ ముఖాముఖి నిర్వహించారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 7 గంటలకు మొదలైన ఈ కార్యక్రమంలో పలువురు ఎన్నారైలు పాల్గొన్నారు.
కాలిఫోర్నియాలోని శాన్ జోస్ సిటీ మిల్పిటాస్లో ‘మీట్ అండ్ గ్రీట్ విత్ కేటీఆర్’ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేందుకు కేసీఆర్ తలపెట్టిన ఈ కార్యక్రమంలో ఎన్నారైలూ భాగస్వాములు కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎన్నారైలు చదువుకున్న పాఠశాలల అభివృద్ధికి తమ వంతు సాయం అందించాలని, తెలంగాణలో ఎన్నారైలు బడులు కట్టాలనుకున్నా, లైబ్రరీలు కట్టించాలనుకున్నా ప్రభుత్వం అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.
తెలంగాణ అభివృద్ధిలో ఎన్నారైల భాగస్వామ్యం ఉండాలని, వారికి మించిన బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరూ లేరని కేటీఆర్ అన్నారు. తెలంగాణ గురించి ఎన్నారైలే గొప్పగా ప్రచారం చేయగలరని చెప్పారు. అభివృద్ధిలో ముందంజలో ఉన్నామని, విద్యావ్యవస్థను పటిష్టం చేస్తున్నామని, ఈ విద్యా యజ్ఞంలో ఎన్నారైలు కూడా పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టబోతున్నామని తెలిపారు.
‘‘నా మాతృభూమి కోసం, నా గ్రామం, పట్టణం కోసం.. నేను ఏదైనా చేయాలి.. చేస్తే బాగుంటుంది.. అవసరమైతే నా తల్లిదండ్రుల పేరు మీదో, నా గ్రాండ్ పేరెంట్స్ పేరు మీదో ఏదో చేయాలి’’ అని ప్రతి ఎన్నారై అనుకుంటే ఈ ‘మన ఊరు మన బడి’ పథకం ఒక మంచి అవకాశమని అన్నారు. అయితే, ఎన్నారైల మీద ఆధారపడి ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయడం లేదని, విద్యారంగాన్ని పటిష్టం చేసేందుకు ప్రైవేటు వ్యక్తుల సహకారం కోరుతున్నామని అన్నారు. తమకు ఇష్టమున్న పాఠశాలను ఎంపిక చేసుకొని ఎన్నారైలు అభివృద్ధి చేయొచ్చని, ఇది ఒక అద్భుత అవకాశమని కేటీఆర్ చెప్పారు.
ఇండియన్ కాన్సులేట్ జనరల్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్, వెటా చైర్మన్ ఝాన్సీ రెడ్డి, సిలికాన్ ఆంధ్రా వ్యవస్థాపకులు ఆనంద్ కూచిభొట్ల, బాటా మాజీ అధ్యక్షరాలు విజయ ఆసూరి మరియు స్థానిక తెలంగాణ నాయకులు రమేష్ తంగెళ్లపల్లి, విజయ చావా, శ్రీనివాస్ మానాప్రగడ తదితరులు పాల్గొన్నారు.