తన జల్సాలకు, వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనో…విడాకులు తీసుకుంటే భరణం చెల్లించాల్సి వస్తుందనో….భార్యలను యాక్సిడెంట్ లా కనిపించే హత్య చేయించడం వంటి ఘటనలు అనేక సినిమాల్లో చూసుంటాం. పోలీసులకు ఏమాత్రం అనుమానం రాకుండా యాక్సిడెంట్ చేయించి…నైస్ గా తప్పించుకునే భర్తలకు సంబంధించిన సన్నివేశాలు సినిమాలలో కోకొల్లలు.
అయితే, సినిమాల నుంచి స్ఫూర్తి పొందిన ఓ భర్త…తన భార్యకు మనోవర్తి, భరణం చెల్లించాల్సి వస్తుందని యాక్సిడెంట్ లాంటి మర్డర్ చేయించాడు. అయితే, అతని పాపం పండడంతో ఆ గుట్టురట్టయి ఇపుడు కటకటాల వెనక్కు వెళ్లేందుకు రెడీగా ఉన్నాడు. సినీ ఫక్కీలో తమిళనాడులో జరిగిన ఈ యాక్సిడెంట్ కమ్ మర్డర్ ఘటన ఇపుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
తమిళనాడులోని తిరువారూర్ పట్ణణానికి చెందిన 28 ఏళ్ల జయభారతికి 2015లో వివాహం జరిగింది. ఆమె భర్త విష్ణు ప్రకాశ్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్. దీంతో, పెళ్లైన తర్వాత ఆమె తన భర్తతో కలిసి అమెరికాకు వెళ్లింది. అయితే, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో జయభారతి తన భర్తను వదిలేసి ఇండియాకు వచ్చి జాబ్ చేసుకుంటోంది. ఇద్దరినీ కలపాలని కుటుంబసభ్యులు ప్రయత్నించినా…జయభారతి మాత్రం విడాకులు కావాలని పట్టుబట్టింది.
ఈ క్రమంలోనే తిరువారూర్ లో మే 21న స్కూటీపై వెళ్తోన్న జయభారతి యాక్సిడెంట్ కు గురైంది. అతి వేగంగా వచ్చిన ఓ టాటా ఏస్ వాహనం ఆమె స్కూటీని ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన ఆమె చికిత్స పొందుతూ మరణించింది. అయితే, విడాకుల వ్యవహారం నేపథ్యంలో అది యాక్సిడెంట్ కాదని అనుమానించిన జయభారతి కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు టాటా ఏస్ ఓనర్ తో పాటు మరో నలుగురిని తమదైన శైలిలో విచారణ జరుపగా అసలు నిజం బయటపడింది.
అమెరికాలో ఉంటున్న జయభారతి భర్తే తన భార్యను చంపమని తమకు సుపారీ ఇచ్చాడని వాళ్లు ఒప్పుకున్నారు. విడాకులు ఇస్తే భరణం ఇవ్వాల్సి వస్తుందనే కారణంతో జయభారతిని యాక్సిండెంట్ చేసి, చంపాల్సిందిగా అమెరికా నుంచి విష్ణు ప్రకాశే తమను సంప్రదించి డబ్బులు ఇచ్చినట్టు ఒప్పకున్నారు. దీంతో, విష్ణు ప్రకాశ్ విషయాన్ని అమెరికాలోని ఇండియన్ ఎంబసీ దృష్టికి తీసుకెళ్లిన పోలీసులు…త్వరలోనే విష్ణు ప్రకాశ్‌ను ఇండియాకు రప్పించి అరెస్ట్ చేయన్నారు.