తెలుగు దేశం పార్టీ ఘనంగా నిర్వహించుకునే పసుపు పండగ మహానాడును అమెరికాలోని ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బోస్టన్‌లో అంగరంగ వైభవంగా మహానాడును నిర్వహించనున్నారు. ఎన్నారై.. టీడీపీ యూఎస్ ఏ కోఆర్డినేటర్ .. జయరాం కోమటి ఆధ్వర్యంలో ఈ మహానాడును అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నెల 20, 21 తేదీల్లో నిర్వహించే బోస్టన్ మహానాడులో పాల్గొనేందుకు అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బోస్టన్‌కు చేరుకున్నారు.
బోస్టన్‌లో మహానాడును కనీ వినీ ఎరుగని రీతిలో నిర్వహించాలని.. ఇప్పటికే సంకల్పం చెప్పుకొన్న టీడీపీ ఎన్నారై విభాగం నేత జయరాం కోమటి.. ఆమేరకుభారీ ఏర్పాట్లు చేశారు. బోస్టన్‌లో స్వయంగా విడిది చేసి మరీ జయరాం కోమటి ఏర్పాట్లను పరిశీలించారు. అతిథులకు అవసరమైన ఏర్పాట్లతో పాటు.. మహానాడులో చర్చించే విషయాలపై ఆయన ఇప్పటికే సమీక్షించారు. ఏపీలో ఏ విధంగా అయితే.. ఘనంగా నిర్వహిస్తారో. అంతకన్నా ఘనంగా బోస్టన్ మహానాడును నిర్వహించేలా జయరాం కోమటి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఫేస్బుక్, యూట్యూబ్ లైవ్‌లలో ప్రసారం చేసే ఏర్పాట్లు కూడా చేశారు.
కరోనా నేపథ్యంలో గత రెండేళ్లు ఈ మహానాడును వర్చువల్‌గానే నిర్వహించారు. అయితే.. ఈ ఏడాది కరోనా తగ్గడంతోపాటు.. ముందస్తు ఎన్నికలు వచ్చే సూచనలు ఉండడంతో పార్టీ అధినేత చంద్రబాబు ఈ ఏడాది మహానాడును ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. దీనికితోడు ఈ ఏడాది పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ శత జయంతి కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో మహానాడుకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. పలు అంశాలపై చర్చించి పార్టీ భవితకు పునాదులు పటిష్టం చేయనున్నారు.
ఇక, బోస్టన్ మహానాడులో పాల్గొనేందుకు ఏపీ నుంచి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ ఎంవీఎస్ రాజు, మాజీ ఎంపీ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, టీడీపీ సీనియర్ నాయకుడు మన్నవ సుబ్బారావు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తదితరులు కూడా ఇప్పటికే చేరుకున్నారు.