తెలుగు దేశం పార్టీ ఎన్నారై యూఎస్ ఏ(అమెరికా) కో ఆర్డినేటర్‌గా ప్రముఖ పారిశ్రామిక వేత్త.. ఉత్తర అమెరికా తెలుగు సంఘం మాజీ అధ్యక్షులు, కీలక బాధ్యులు జయరాం కోమటి నియమితులయ్యారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు జయరాం కోమటిని నియమించినట్లు ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ సందర్భంగా జయరాం కోమటి మాట్లాడుతూ.. తనపై ఎంతో నమ్మకంతో బాధ్యత అప్పగించిన చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు. అమెరికాలో పార్టీ పటిష్ఠతకు మరింత కృషి చేస్తానని చెప్పారు. 2024 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ విజయమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. జయరాం కోమటి నియామకంపై ప్రవాసాంధ్రులు, టీడీపీ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
ఇదిలావుంటే.. రాష్ట్రంలోనే కాకుండా.. విదేశాల్లోనూ పార్టీని పటిష్టం చేసేందుకు చంద్రబాబు వ్యూహాత్మ కంగా అడుగులు వేస్తున్నారు. అమెరికా, దుబాయ్, కెనడా వంటి దేశాల్లో ఉన్న టీడీపీ సభ్యత్వాలను పెంచడంతోపాటు.. అక్కడ పార్టీకి బాధ్యులను నియమిస్తున్నారు. ఎన్నారై వర్గాల్లో పార్టీ ప్రాధాన్యాన్ని పెంచడంతోపాటు.. వచ్చే ఎన్నికల్లో వీరి సహాయాన్ని చంద్రబాబు కోరుతున్నారు.
ఇప్పటికే దుబాయ్‌లో పార్టీ కార్యవర్గ నిర్మాణంపై దృష్టి పెట్టిన చంద్రబాబు.. అక్కడివారితో తరచుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చిస్తున్నారు. తాజాగా జరిగిన జయరాం కోమటి నియామకంతో అమెరికాలో టీడీపీ కార్యక్రమాలు పుంజుకోవడంతోపాటు.. వచ్చే ఎన్నికల్లో పార్టీకి లబ్ధి చేకూరుతుందని.. చంద్రబాబు భావిస్తున్నారు.