ఎందరో తెలుగు బిడ్డలు సప్త సముద్రాలు దాటి మరీ తమ డాలర్ డ్రీమ్స్ నెరవేర్చుకునేందుకు ఎన్నో దశాబ్దాలుగా అమెరికాకు వలస వెళ్తున్న సంగతి తెలిసిందే. ఉద్యోగం, వ్యాపారం, ఉన్నత విద్య..ఇలా రకరకాల కారణాలతో అమెరికాలో స్థిరపడ్డ తెలుగువారి సంఖ్య గణనీయంగా ఉంటుంది. అలా అమెరికాలో స్థిరపడ్డ తెలుగువారిలో చాలామంది ఉద్యోగాలు, వ్యాపారాలకే పరిమితం కాకుండా అక్కడి రాజకీయాలలో, అక్కడ ప్రభుత్వ ఉద్యోగాల్లో, న్యాయస్థానాల్లో కూడా సత్తా చాటుతున్నారు. విజయవాడకు చెందిన ఎన్నారై ‘జయ బాడిగ’ కూడా ఈ కోవలోకే వస్తారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో తొలి తెలుగు మహిళా న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన ‘జయ బాడిగ’ తెలుగువారు గర్వపడేలా చేశారు.
అగ్రరాజ్యం అమెరికాలో కీలక స్థానాల్లో ఉన్న తెలుగువారి సరసన జయ బాడిగ కూడా చేరారు. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా ‘జయ బాడిగ’ అపాయింట్ అయ్యారు. 2022 నుండి కోర్టు కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న ‘జయ బాడిగ’…కుటుంబ వ్యవహారాల చట్టంలో నిపుణురాలు. న్యాయపరమైన మార్గదర్శకురాలిగా ఆమె ఎంతోమందికి విలువైన సేవలందించారు. అమెరికాలో జడ్జిగా నియమితురాలైన తొలి తెలుగు మహిళ ‘జయ బాడిగ’ కావడం విశేషం.
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో జన్మించిన ‘జయ బాడిగ’…హైదరాబాద్‌లో ప్రాథమిక విద్యనభ్యసించారు. 1991 నుండి 1994 వరకు హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో సైకాలజీ, పొలిటికల్ సైన్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ చదివారు. 2018 నుండి 2022 వరకు ప్రాక్టీషనర్ గా విధులు నిర్వర్తించారు. కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్‌లో, కాలిఫోర్నియా గవర్నర్స్ ఆఫీస్ ఆఫ్ ఎమర్జెన్సీ సర్వీసెస్‌లో అటార్నీగా పనిచేసిన అనుభవం కూడా ‘జయ బాడి’గ సొంతం. శాంటా క్లారా యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ లా నుండి జ్యూరిస్ డాక్టర్ డిగ్రీని, బోస్టన్ నుండి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్‌లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని ఆమె సాధించి సత్తా చాటారు.