టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు, జైలు విషయంపై ప్రజల్లో ఆగ్రహం పొడచూపుతోంది. నిన్న మొన్నటి వరకు నిరసనలకే పరిమితమైన ప్రజలు.. ఇప్పుడు తమ ఆవేదనను సైతం పంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఒక ఎన్నారై సోషల్ మీడియాలో చేసిన పోస్టు అందరినీ ఆలోచింపజేస్తోంది. చంద్రబాబును అరెస్టు చేసినప్పటి నుంచి తాను నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్టు ఆయన పేర్కొన్నారు.
యునైటెడ్ కింగ్డమ్లో ప్రభుత్వోద్యోగిగా పనిచేస్తున్న ఎన్నారై విజయ్ ఈ మేరకు తన ఆవేదనను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఏ దేశమేగినా.. ఎందు కాలిడినా బాబుకు అండగా నిలవాలని తెలుగువారందరికీ ఆయన పిలుపునిచ్చారు. ‘‘నేను ఇప్పుడు ఈ ఉద్యోగం చేస్తున్నానంటే అందుకు కారణం చంద్రబాబు. ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా 20 ఏళ్ల కిత్రం హైదరాబాద్ గచ్చిబౌలిలో ఆయన నెలకొల్పిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో చదువుకోవడం వల్లే నేనీ స్థాయికి చేరుకున్నాను“ అని విజయ్ తన సెల్ఫీ వీడియోలో స్పష్టం చేశారు.
స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో ఏదో జరిగిపోయిందంటూ ఏపీ ప్రభుత్వం చంద్రబాబును అరెస్టు చేయడం బాధిస్తోందని విజయ్ పేర్కొన్నారు. ఆఫీసుకు కూడా తాను వెళ్లడం లేదన్నారు. మనసు రావడం లేదన్నారు. చంద్రబాబు తన హృదయానికి దగ్గరయ్యారని, ఆయన్ను తన పెద్దన్నలా భావిస్తున్నానని తెలిపారు. నాడు ఆయన వేసిన పునాదులే తనతో సహా తెలుగు వారందరినీ వివిధ దేశాల్లో ఉన్నత స్థానాల్లో నిలిపాయని విజయ్ పేర్కొన్నారు.
చంద్రబాబు విజన్ ఉన్న నేత అని విజయ్ కొనియాడారు. నేడు ఆయన రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చిందని, ప్రాంతాలకు అతీతంగా చంద్రబాబుకు అండగా నిలుద్దామని ప్రవాసాంధ్రులకు ఆయన పిలుపునిచ్చారు. “నేను సైతం బాబుతో… మరి మీరు?’’ అని విజయ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండడం విశేషం.