ఏపీ సీఎం జగన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిల బెయిల్ రద్దు పిటిషన్ వ్యవహారంపై కొద్ది నెలల క్రితం దేశవ్యాప్తంగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. వారి బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లను నాంపల్లి సీబీఐ కోర్టు కొట్టివేయడం, ఆ పిటిషన్లను మరో న్యాయస్థానానికి బదిలీ చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో రఘురామ పిటిషన్ దాఖలు చేయడం వెంటవెంటే జరిగాయి.
అయితే, రఘురామ వేసిన ఆ పిటిషన్ ను కూడా తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. బెయిల్ రద్దు పిటిషన్ పై సిబీఐ కోర్టు తుది తీర్పునివ్వకుండా ఆదేశాలివ్వాలని ఆ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలోనే తెలంగాణ హైకోర్టులో జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామ కొద్ది నెలల క్రితం మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్ కు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది.
బెయిల్ రద్దు పిటిషన్ పై సీఎం జగన్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఈ పిటిషన్లపై తదుపరి విచారణను 2 వారాల పాటు వాయిదా వేసింది. అంతకుముందు రఘురామ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్పై 11 ఛార్జ్షీట్లు ఉన్నాయని కోర్టుకి తెలిపారు. బెయిల్ రద్దు చేసి 11 ఛార్జ్ షీట్ లపై సత్వర విచారణ చేపట్టాలని రఘురామ తరఫు న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.