కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో జగన్ విఫలమయ్యారని తీవ్ర విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఇటు స్వపక్షం…అటు విపక్షం….వెరసి జగన్ పై మూకుమ్మడిగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ క్రమంలోనే కర్నూలులో కరోనా కొత్త వేరియంట్ ఎన్-440కే వైరస్ ఉనికిపై ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు…ప్రజలను అప్రమత్తం చేశారు.
అయితే, అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అన్న చందంగా…ఈ కొత్త వైరస్ పై ఒక్క మాటకూడా మాట్లాడని జగన్….ప్రజలను అప్రమత్తం చేసిన పాపానికి చంద్రబాబుపై కేసు నమోదు చేస్తుంటే చోద్యం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం కావడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అయినప్పటికీ, చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు కర్నూలు పోలీసులు సిద్ధమవడం ఇపుడు ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోంది.
చంద్రబాబుపై కర్నూలు జిల్లాలో నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు ఈ క్రమంలోనే మరి కాసేపట్లో హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి.కర్నూలు వన్ టౌన్ పోలీసులు చేరుకోనున్నారు. చంద్రబాబుకు నోటీసులు ఇచ్చి వారం రోజుల లోపు హాజరు కావాలని పోలీసులు కోరనున్నట్లు తెలుస్తోంది. ఎన్-440కే వైరస్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై కర్నూలు వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు కర్నూలు ఎస్పీ ఫక్కీరప్ప వెల్లడించారు.
ఎన్-440కే స్టెయిన్ కర్నూలులో ఎక్కువగా ఉన్నట్లు చంద్రబాబు భయాందోళనలకు గురి చేశారని సీనియర్ న్యాయవాది సుబ్బయ్య వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేయడంతో విపత్తు నిర్వహణ చట్టం కింద 2005 కింద కేసు నమోదు చేశారన్నారు. ఆదివారంనాడు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చి 7 రోజులలోపు విచారణకు హాజరు కావాలని కోరతామని తెలిపారు. చంద్రబాబుకు 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇస్తున్నామన్నారు.