నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును అర్ధరాత్రిపూట అక్రమంగా అరెస్టు చేసిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. రఘురామ పుట్టినరోజు నాడు కావాలని అరెస్టు చేశారని, జగన్ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే సీఐడీ సుమోటోగా కేసు నమోదు చేసిందని ఆరోపణలు వచ్చాయి. దాంతోపాటు, కస్టడీలో రఘురామపై రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించి కొట్టారన్న ఆరోపణలు సంచలనం రేపాయి.
స్వయంగా రఘురామ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడం, ఈ వ్యవహారంపై విచారణ జరుపగా గాయాలు నిజమేనని ఆర్మీ ఆస్పత్రి సుప్రీంకోర్టుకు వెల్లడించడం చర్చనీయాంశమయ్యాయి. ఏపీలో కస్టడీలో ఓ ఎంపీకే ఇలా జరిగితే సామాన్యుల పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఈ క్రమంలోనే బెయిల్ పై విడుదలైన రఘురామ ఢిల్లీ వెళ్లి చక్రం తిప్పడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే రఘురామ గేమ్ స్టార్ట్ చేయడంతో ఏపీ డీజీపీకి గట్టి షాక్ తగిలింది.
తన తండ్రిని అరెస్ట్ చేసిన తీరు, తదనంతర పరిణామాలపై రఘురామకృష్ణరాజు తనయుడు భరత్ చేసిన ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ఆర్ సీ) తాజాగా స్పందించింది. ఈ విషయంలో వివరణ ఇవ్వాలంటూ ఏపీ డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శికి ఎన్ హెచ్ఆర్ సీ నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లోగా ఆ నోటీసులకు బదులివ్వాలని స్పష్టం చేసింది.
మరోవైపు, సీఐడీ కస్టడీలో రఘురామపై పోలీసులు దాడి చేశారన్న ఆరోపణలపైనా జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఈ వ్యవహారంపై అంతర్గత విచారణ జరపాలని ఏపీ సీఐడీ డీజీని ఆదేశించింది. జూన్ 7 లోగా ఈ అంశంపై నివేదిక ఇవ్వాలని నిర్దేశించింది. తాజా పరిణామాలతో ఏపీ సీఐడీ పోలీసులకు తిప్పలు తప్పవని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఢిల్లీ వెళ్లిన రాజుగారు ఆట మొదలెట్టారని…ఇక దబిడి దిబిడే అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నరు.